వేగం తెచ్చిన ఘోరం..!
– ఎదురెదురుగా రెండు బైకులు ఢీ
– తండ్రి కొడుకులకు తీవ్రగాయాలు
– హైదరాబాద్‌కు తరలిస్తుండగా తండ్రి మృతి
తాండూరు, దర్శిని ప్రతినిధి: అతి వేగంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు తండ్రి కొడులకు తీవ్రగాయాలయ్యాయి. ఓ తండ్రి పరిస్థితి విషమించడంతో అతన్ని హైదరాబాద్ కు తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం ఉదయం తాండూరు పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మున్సిపల్ పరిధి ఎన్టీఆర్ కాలనీకి చెందిన రాజు(34) పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకులో అటెండర్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం ఎన్టీఆర్ కాలనీ నుంచి తన కుమారుడుతో కలిసి బైకుపై తాండూరు పట్టణం వైపు బయల్దేరాడు. అదేవిధంగా పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు పట్టణం నుంచి అంతారం మీదుగా గ్రామం వైపు వెళుతున్నారు. మార్గమధ్యలోని టీఆర్సీ వద్దకు రాగానే అతి వేగంతో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు బైకులపై ఉన్న తండ్రీ కొడులకు గాయాలయ్యాయి. రాజు తలకు, కాలుకు బలమైన గాయాలు కావడంతో పరిస్థితి విషమించింది. వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు రిఫర్ చేశారు. రాజును హైదరాబాద్ కు తరలిస్తుండగా మృతి చెందినట్లు కుటుంభ సభ్యులు తెలిపారు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతామని పోలీసులు తెలిపారు.

