చలికాలం.. చక్కటి ఆహారం..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ వికారాబాద్ హైదరాబాద్

చలికాలం.. చక్కటి ఆహారం..!
– పండ్లు.. పదార్థాలతో సంపూర్ణ ఆరోగ్యం
– ఇంకేందుకు ఆలస్యం చక్కగా లాగించేయండి
దర్శిని డెస్క్ : చలికాలం.. మొదలైందంటే చాలు. అందరికి ఆరోగ్యంపై శ్రద్ధ వస్తుంది. ఉదయం లేవ లేవగానే వాకింగ్, జాగింగ్ అంటూ బయల్దేరుతారు. ఆరోగ్యంపై అంత శ్రద్ధ తీసుకునే వారు కాస్త ఆహారంపై కూడ దృష్టిసారించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చక్కటి ఆహారంలో పలు సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు. మరి ఈ సీజన్లో తీసుకోవాసిన పదార్థాలు.. పండ్ల గురించి తెలుసుకుందాం.


వేరు శనగలు

వేరు శనగల్లో విటమిన్ ఈ.బి. పుష్కలంగా ఉంటాయి. మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెకు చాలా మేలు చేస్తాయి. వేరుశనగ గింజల్లో నూనే శాంత ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో తేమను పెంచి.. చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.

నువ్వులు
నువ్వులు తగిన మోతాదులో తీసుకుంటే శరీరానికి చక్కటి వేడి లభిస్తుంది. నువ్వుల్లో కాల్షియం, ఖనిజ లవణాలు, మాంగనీస్, ఇనుము, మెగ్నీషియం వంటివి సమృద్ధిగా ఉంటాయి. భోజనం తరువాత నువ్వులతో చేసిన పధార్థాలను తీసుకోవడం వల్ల ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. నువ్వుల వల్ల చర్మం పొడిబారకుండా తేమగా ఉంటుంది.

జొన్నలు
జొన్నలతో చేసిన ఆహారం మనిషికి ఎంతో మేలు చేస్తుంది. చలికాలంలో వారానికి ఒక్కసారి అయినా జోన్నలతో చేసిన ఆహారం తీసుకోవాలి. జొన్నల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కండరాల కదలికలకు బాగా ఉపకరిస్తుంది. జొన్నతో చేసిన ఆహార పదార్థాలను అల్లం చట్నీతో తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

పాలకూర
చలికాలంలో ఆకుకూరలు ఎంతో ఉపకరిస్తాయి. వీటిలో యాంటీ యాక్సిడెంట్స్ అధిక మోతాదులో ఉండడంతో పాటు ఇనుము, కాల్షియంలు సమృద్ధిగా లభిస్తాయి. ప్రతిరో జూ పాలకూరను ఉడికించి లేదా సూపు.. రసం రూపంలో తీసుకుంటే ఎముకల్లో పటుత్వం పెరుగుతుంది.

చిలగడ దుంపలు
వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దుంపల వల్ల శరీరానికి కావాల్సినంత వేడిని అందిస్తాయి. పిల్లల నుంచి వయోధికుల వరకు వీటిని తీసుకోవచ్చు. వీటిలో ఉండే పీచు, కార్బోహైడ్రేట్స్, విటమిన్ -ఎ, సితో పాటు ఖనిజ లవణాల్ని శరీరానికి అందిస్తాయి. చిలగడ దుంపలను ఉడికించి కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని తింటే రుచికరంగా ఉంటాయి. చిలగడ దుంపల వల్ల చలికాలంలో ఎదురయ్యే చాలా రకాల సమస్యలు నివారించవచ్చు.

డ్రైఫ్రూట్స్‌
డ్రైఫ్రూట్స్‌ను చలికాలంలో తప్పనిసరిగా తీసుకోవాలి. అన్నిరకాల డ్రైఫ్రూట్స్లోని పోషకాలు మెండుగా ఉంటాయి. చలికాలంలో కావాల్సిన శక్తి వీటివల్ల లభిస్తుంది. జీర్ణశక్తిని కూడ అధికం చేస్తాయి. రక్తాన్ని కూడ శుద్ధి చేస్తాయి. డ్రైఫ్రూట్స్ నేరుగా లేదా ఆహారంలో భాగంగానైనా తీసుకోవచ్చు.