టీ.. విత్ సిగరెట్ వేరీ డేంజర్
– రెండు కలిపి తాగితే ప్రమాదంలో పడ్డట్లే
– ఏయే వ్యాధులు వస్తాయో తెలిస్తే షాక్
దర్శిని డెస్క్: చాలా మంది సరదా కోసం సిగరెట్ తాగడం అలవాటు చేసుకుంటారు. మరింత స్టైలిష్‌గా టీ సేవిస్తూ సిగరెట్ ఆస్వాదించడం నేటి యువతకు ఫ్యాషన్. కాని ఈ రెండిటిని కలిపి తాగడం వల్ల చాలా డేంజర్ అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ అలవాటు తెలుసో తెలియకో ఎన్నో సంవత్సరాల నుంచి చాలామంది ప్రజల జీవన శైలిలో ఒక భాగం అయిపోయింది. టీతో పాటు సిగరెట్ తాగడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇవి రెండు కలిస్తే ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం. తాజాగా జరిగిన పరిశోధనల ప్రకారం ధూమపానం చేసేవారు, మద్యపానం చేసేవారు కలిసి టీ తీసుకుంటే అది జీర్ణ వ్యవస్థ క్యాన్సర్ ప్రమాదాన్ని 30% వరకు పెంచుతుంది. టీ సిగరెట్ ను కలిపి తీసుకుంటే శరీరంలోని కణాలు దెబ్బతింటాయి. జీర్ణాశయ క్యాన్సర్ ప్రమాదం రెండు రెట్లు పెరిగే అవకాశం ఉంది.
ఇంకా చెప్పాలంటే టీలో కెఫిన్ అధికంగా ఉంటుంది. దీనివల్ల కడుపులో ఒక ప్రత్యేక రకం యాసిడ్ ఉత్పత్తి అవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే అధిక మొత్తంలో కెఫిన్ పొట్టలోకి చేరితే హాని కలిగి ఎన్నో రకాల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని చెబుతున్నారు. మరోవైపు నికోటిన్ సిగరెట్ లేదా బీడీలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖాళీ కడుపుతో టి, సిగరెట్ కలిపి తీసుకుంటే తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలు వెంటనే కనిపిస్తాయి.రోజుకు ఒక సిగరెట్ హానికరమా అని చాలామంది దాన్ని లైట్‌గా తీసుకుంటూ ఉంటారు. చాలా హానికరమని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే సీక్రెట్ తాగే వారికి కూడా బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కొన్ని పరిశోధనల ప్రకారం సాధారణ వ్యక్తులతో పోలిస్తే రోజుకు ఒక సిగరెట్ తాగే వారిలో గుండెపోటు ప్రమాదం 7% పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది కాకుండా మీరు చైన్ స్మోకర్ అయితే మీ వయసును 17 సంవత్సరాలు తగ్గించే ప్రమాదం ఉంది. ఒక సంవత్సరం పాటు ధూమపానం పూర్తిగా మానేసినట్లయితే దాని ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. మీ అవయవాలు సాధారణ వ్యక్తి లాగా పని చేస్తాయి. ముఖ్యంగా మెదడు, గుండె సాధారణ వ్యక్తుల పనిచేయడం మొదలవుతుంది.


