జిప్సం కర్మాగారాన్ని మూసేయండి
– కాలుష్యం వల్ల ప్రాణాలపై ప్రభావం
– తాగునీరు కలుషితంతో మూగజీవాల మృత్యువాత
– నాశనమవుతున్న పంటలు, వేధిస్తున్న వ్యాధులు
– ఆందోళనకు దిగిన గుంతబాస్పల్లి గ్రామస్తులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ప్రజలు, రైతులు, మూగ జీవాల మనుగడకు ఇబ్బందిగా మారిన జిప్సం కర్మాగారాన్ని మూసివేయాలంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. కర్మాగారం సమీప ప్రాంతంలో నిరసన చేపట్టారు. ఈ సంఘటన తాండూరు మండలం గుంతబాస్పల్లి గ్రామ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… మండలంలోని గుంతబాస్పల్లి, మిట్టబాస్పల్లి గ్రామాల శివారులో జిప్సం కర్మాగారం కొనసాగుతుంది. ఈ కర్మాగారం నుంచి కాలుష్యం, దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగా ఐసీఎల్ కర్మాగారానికి వెళ్లే ప్రధాన రహదారి వద్ద మండలంలోని గుంతబాస్పల్లి గ్రామ రైతులు, గ్రామస్తులు శనివారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జిప్సం కర్మాగారం కాలుష్యం వల్ల ఊపిరిరాడడం లేదని అగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం దుర్వాసనతో పాటు కాలుష్యం వల్ల సాగు, తాగునీరు కలుషితం అవుతున్నాయని ఆరోపించారు. నీరు వల్ల పంటలు నాశనమవుతున్నాయని అన్నా ప్రజలు చర్మ వ్యాధులకు గురవుతున్నారని. మూగజీవాలు నీరు సేవించి మృత్యువాత పాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముడి సరుకులను ట్రక్కులో తీసుకవచ్చి జిప్సం తయారు చేస్తున్నారని అన్నారు. కర్మాగారంపై చర్యలు తీసుకోవడంలో అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని వాపోయారు. వెంటనే కర్మాగారాన్ని మూసి వేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు గ్రామస్తులు ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న కరణ్ కోట్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడారు.

