థ్రిల్లింగ్ మీటీంగ్‌..!

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

థ్రిల్లింగ్ మీటీంగ్‌..!
– ఎజెండా ఆమోదంలో ఎత్తుల పైఎత్తులు
– బీజేపీ కౌన్సిలర్లతో బెడిసిన వ్యూహాం
– 6 అంశాలతకు మెజార్టీ కౌన్సిలర్ల వ్యతరేకం
– హైడ్రామాగా కౌన్సిల్ సమావేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం థ్రిల్లింగ్‌ను తలపించింది. దాదాపు ఆరు నెలల తరువాత ఎన్నో వివాదాలను దాటుకుని ఏర్పాటు చేసిన సమావేశంపై అందరి దృష్టి ఏర్పడింది. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ప్రారంభమైన సమావేశం సస్పెన్స్‌ను పెంచింది. పలు వాయిదాల మద్య దాదాపు 6 గంటల పాటు సమావేశం కొనసాగింది. 41 అంశాలతో ప్రవేశ పెట్టిన ఎజెండా ఆమోదానికి ఎత్తులు, పై ఎత్తుల ప్రదర్శన కనిపించింది. మొత్తానికి 35 అంశాలు ఆమోదమై.. 6 అంశాలను మెజార్టీ కౌన్సిలర్లు వ్యతిరేకించినట్లు ప్రకటించారు. బుధవారం మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అధ్యక్షతన సాధారణ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. 11 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. మధ్యాహ్నం వరకు 41 అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ఎజెండాలోని 10, 11, 13, 34, 37, 41 అంశాలను మెజార్టీ కౌన్సిలర్లు వ్యతిరేకించారు. మిగతా అన్ని అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు వ్యతిరేక కౌన్సిలర్లు ప్రకటించారు. వ్యతిరేకించిన అంశాలను ఆమోదించుకునేందుకు 19 మంది ఆమోదం కావాల్సి ఉండగా 16 మంది ఆమోదం మాత్రమే లభించింది. అమోదంలో కీలకంగా మారిన బీజేపీ కౌన్సిలర్లతో వ్యూహాలను రచించారు.

ఈ క్రమంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గాలకు చెందిన వాహనాలు పెద్ద ఎత్తున కార్యాలయానికి చేరుకున్నారు. మున్సిపల్ ముందు వాహనాల వల్ల రాజకీయ ప్రదర్శన వాతావరణం నెలకొంది. దీంతో ఎజెండా అంశాల ఆమోదం కార్యాలయ ప్రాంగణం నాటకీయ వేదికగా మారింది. ఎమ్మెల్సీ వర్గం, ఎమ్మెల్యే వర్గం ఎత్తులు, పై ఎత్తులు వేశారు. సుమారు మూడు గంటల పాటు వేచి చూసిన ఎమ్మెల్సీ వర్గం వ్యూహాలు బెడిసి కొట్టాయి. బీజేపీ కౌన్సిలర్లు అమోదం తెలపకపోవడంతో సమావేశం ఎట్టకేలకు ముగించేశారు. కౌన్సిల్ సమావేశం, ఎజెండా అంశాల ఆమోదంపై అటు చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌, ఇటు ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్ లు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా బుధవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశానికి పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఉదయం నుంచి సమావేశం ముగిసే వరకు పోలీసులు బందోబస్తును నిర్వహించగా మినిట్ టు మినిట్ ఇంటిలిజెంట్, నిఘా బృందాలు సైతం సమీపం నుంచి ఆరా తీశారు.