తడబాటు వైద్యం వల్లే..!
– పార్వతమ్మకు చేతి స్పర్శ కట్
– ఆమె చేతికి మెరుగైన చికిత్స చేయిస్తాం
– వికారాబాద్ డీసీహెచ్ఎస్ డా.ప్రదీప్ కుమార్
– బాలింత సంఘటనపై ఎంసీహెచ్ లో విచారణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని మాతా శిశు ఆసుపత్రిలో పార్వతమ్మ అనే మహిళకు ప్రసవ సమయంలో అందిన తడబాటు వైద్యం వల్ల ఆమె చేతి స్పర్శ కోల్పోవడం జరిగిందని వైద్యులు నిర్దారించారు. దీంతో ఆమెకు దిద్దుబాటు చర్యగా మెరుగైన శస్త్ర చికిత్స అందేలా చూస్తామని బాధిత కుటుంబానికి హామి ఇచ్చారు. తాండూరు పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన మహిళకు అందించిన వైద్యం వల్ల పారతమ్మ అనే బాలింతకు చేతి స్పర్శ కోల్పోయిన సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. పత్రికల్లో వచ్చిన కథనాల మేరకు జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు గురువారం వికారాబాద్ డీసీ హెచ్ఎస్ డా.ప్రదీప్ కుమార్ మాతా శిశు ఆసుపత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం బొంరెడ్డిపల్లికి చెందిన హరిజన్ శ్రీనివాస్ భార్య పార్వతమ్మ జనవరి 17వ తేదిన మాతా శిశు ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చింది. అయితే ప్రసవం వైద్య చికిత్సలో భాగంగా పార్వతమ్మకు వైద్య సిబ్బంది ఇచ్చిన ఇంజక్షన్ వల్ల ఆమె చేతి స్పర్శ కోల్పోయినట్లు విచారణలో తేలిందని డీసీ హెచ్ఎస్ డా.ప్రదీప్ కుమార్ తెలిపారు. మరుసటి రోజు వైద్యులు ఆమెను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రితో పాటు మహబూబ్ నగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రి, మళ్లీ హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నట్లు తెలిసిందన్నారు. ఈక్రమంలో పార్వతమ్మ చేతికి ఇన్‌ఫెక్షన్ సోకిందని అనుమానించారు. దీంతో గత సోమవారం బాధిత కటుంబ సభ్యులు బాలింతతో కలిసి తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్లో కలిసి పరిస్థితి వివరించి ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. పార్వతమ్మ ప్రసవం సమయంలో ఓ స్టూడెంట్ నర్సు, ఓ పర్యవేక్షణ స్టాప్ నర్సు ఉన్నారని తెలిపారు. వారు అందించిన వైద్యంలోనే తడబాటు జరిగిందని, ఇందుకు వారిపై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా పార్వతమ్మకు గాంధీ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సోమవారం ఆమెను గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేసి శస్త్ర చికిత్స అందేలా చూస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డా. రవిశంకర్, తదితరులు ఉన్నారు.

