గృహ గ్యాస్ సిలిండర్లతో దందాలకు కళ్లెం..!
– అక్రమ వినియోగంపై టాస్క్‌ఫోర్స్ దాడులు
– కోడంగల్‌లో 30 గృహ గ్యాస్ సిలిండర్ల స్వాదీనం
– ఆరు హోటళ్ల వ్యాపారులపై కేసులు నమోదు
కోడంగల్, దర్శిని ప్రతినిధి: గృహ సంబంధిత గ్యాస్ సిలిండర్లతో చేపడుతున్న దందాలకు వికారాబాద్ జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు కళ్లెం వేశారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం దాడులు చేపట్టింది. కోడంగల్ పోలీస్టేషన్ పరిధిలో పలు హోటళ్లపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఆరు హోటళ్లలో అక్రమంగా వినియోగిస్తున్న వంట గ్యాస్ సిలిండర్లను స్వాదీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో మొత్తం 30 గ్యాస్ సిలిండర్లను తీసుకుని స్థానిక పోలీస్టేషన్లో అప్పగించారు. ఈ మేరకు కోడంగల్ పోలీసులు అక్రమంగా వంట గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్న వ్యాపారులపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై జిల్లా పోలీస్టేషన్ శాఖ నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ గృహ సంబంధిత గ్యాస్ సిలిండర్లను వినియోగించడం నేరమన్నారు. నిబంధనలకు విరుద్దంగా వినియోగానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

