శివకుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేయించండి
– తాండూరు ఎమ్మెల్యేతో ముద్దాయి పేట్ వాసుల విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : పదో తరగతి ప్రశ్నాపత్రం ప్రత్యక్షం ఘటనలో సస్పెన్షన్‌కు గురైన శివకుమార్‌పై ఆ సస్పెన్షన్ తొలగించేవిధంగా చూడాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో ముద్దాయిపేట్ గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. పదో తరగతి పరీక్షలకు సంబంధించి తాండూరు పట్టణంలోని ప్రభుత్వ నెంబర్ 1 పాఠశాల పరీక్షా కేంద్రంలో డీఓ(డిపార్ట్ మెంట్ ఆఫీసర్)గా ఉన్న శివకుమార్‌పై జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ వేసిన విషయం తెలిసిందే. మంగళవారం యాలాల మండలంలోని ముద్దా పేట్ గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ పెద్దలు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ముద్దాయి పేట్‌లో ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్న శివకుమార్ గ్రామ పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని ఎమ్మెల్యేకు వివరించారు.
పాఠశాలను ఉన్నత స్థానంలో నిలిపేందుకు, ఎన్నో సార్లు గ్రామానికి.. పాఠశాలకు పేరు తీసుకవచ్చారని గుర్తుచేశారు. వాట్సాప్ లో పదోతరగతి ప్రశ్నాపత్రం ప్రత్యక్షం ఘటనలో ప్రధానోపాధ్యాయుడు శివకుమార్‌పై అకారణంగా సస్పెన్షన్ వేటు వేశారని, దానిని తొలగించేందుకు చొరవ చూపాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పందిస్తూ విద్యాశాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామి ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు.

