రైల్వే డిమాండ్ సాధించుకుందాం..!
– రైల్వే సాధన సమితికి అండగా ఉంటా
– బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీకృష్ణ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: రైల్వే డిమాండ్ సాధించుకునేంత వరకు అందరు ఉద్యమించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ అన్నారు. బషీరాబాద్ మండల కేంద్రంలో గత పది రోజులుగా రైల్వే సాధన సమితి సభ్యులు చేపడుతున్న నిరసన కార్యక్రమానికి మురళీకృష్ణ గౌడ్ మద్దతు తెలిపారు. ఆదివారం నిరసన దీక్షా శిబిరానికి చేరుకుని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బషీరాబాద్ మండల్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, ఇప్పటివరకు అభివృద్ధిలో పెద్ద మార్పు కనిపించడం లేదని అన్నారు. ఇక్కడి ప్రజలు, వ్యాపారులు, కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులు బషీరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లడం జరుగుతుందని సరైన రైల్వే సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ప్రవేట్ వాహనాలలో వెళ్లడం ద్వారా ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తుందన్నారు. బషీరాబాద్‌లో రైల్వే సౌకర్యం కల్పించాలని రైల్వే సాధన సమితి సభ్యులు చేస్తున్న డిమాండ్ న్యాయబద్ధమైనవన్నారు. గతంలో ఈ డిమాండ్‌పై మేము రైల్వే జీఎం, సంబంధిత అధికారులకు వినతి పత్రాలు సమర్పించడం జరిగిందని గుర్తుచేశారు. వారం, 15 రోజుల క్రితం కూడ వ్యక్తిగతంగా అధికారులు కలవడం జరిగిందని, కాని ప్రధానమంత్రి గారి కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్ల చర్చించడం సాధ్యం కాలేదన్నారు. అయినా అందరం కలిసి రైల్వే జీఎం, సంబంధిత అధికారులపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం ఏదో ఒక ట్రైన్ ను నిలిపేవిధంగా ఉద్యమిద్దామన్నారు. ఇందుకు పూర్తి మద్దతు ఇచ్చి అండగా నిలుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, బషీరాబాద్ మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు వీరమణీ, రైల్వే సాధన సమితి సభ్యులు జయరాం చారి, ప్రశాంత్, రాఘవేంద్ర చారి, హనుమంతు, శ్రీనివాస్, నవీన్ కుమార్, అంజి, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

