మూడు వేల వరకు అనర్హులు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మూడు వేల వరకు అనర్హులు..!
– ఇండ్లు, కార్లు ఉన్న వివరాలు గోప్యం
– కొనసాగుతున్న డబుల్ దరఖాస్తుల విచారణ
– విచారణ తరువాత మరోసారి వడబోత సూచన
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్‌ పరిధిలో పేదలకు అందజేయబోతున్న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల దరఖాస్తుల్లో జల్లెడ కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో మూడు వేల మంది అనర్హులుగా తేలినట్లు ప్రత్యేక బృందాలు గుర్తించాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పంపిణీ కోసం వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశాలతో గత నెల మున్సిపల్ పరిధి నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. 36 వార్డులకు సంబంధించి దాదాపు వారం రోజుల పాటు జరిగిన దరఖాస్తుల స్వీకరణలో 9436 దరఖాస్తులు అయ్యాయి. వచ్చిన దరఖాస్తులను విచారించేందుకు తాండూరు తహసీల్దార్ చిన్నప్పల నాయుడు, మున్సిపల్ కమీషనర్ శంకర్‌ సింగ్‌ల నేతృత్వంలో 147 మందితో 49 బృందాలను నియమించారు.

తాండూరు పట్టణంలో వారం, పది రోజుల నుంచి ఈ ప్రత్యేక బృందాలు దరఖాస్తుల విచారణ చేపడుతోంది. దరఖాస్తులు చేసుకున్న వారిలో నిజంగా పేదవారా కాదా అనే విచారణ జరుపుతున్నారు. సొంత ఇళ్లు, ఇతర ఆస్తిపాస్తులు, కారు, బైక్ వంటి వివరాలను సేకరిస్తూ నమోదు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో జరిగిన విచారణలో అత్యధింగా అనర్హులు దరఖాస్తులు చేసుకున్నట్లు వెల్లడవుతోంది. సొంత ఇళ్లు ఉన్నప్పటి లేనట్లుగా, ఇతర ఆస్తులు ఉన్న తెలపకుండా సమాచారం అందిస్తున్నట్లు బృందాలు అనుమానిస్తున్నాయి. ఇలా డబుల్‌ దరఖాస్తుల్లో దాదాపు 3 వేల మంది అనర్హులు ఉన్నట్లుగా గుర్తించారు. మరో నాలుగైదు రోజులు విచారణ జరుగుతుందని, ఇందులో కూడ ఇంకా అనర్హులు తేలే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు అధికారులు విచారణ తరువాత మిగిలిన దరఖాస్తులను కూడ మళ్లీ వడబోసే అవకాశం ఉందని, ఆ తరువాతనే డబుల్‌ అర్హులను ఎంపిక చేయడం జరుగుతుందని అధికారులు సూచనప్రాయంగా పేర్కొంటున్నారు.