ఆసరాపై అస్పష్టత..!
– దరఖాస్తుల విచారణపై అయోమయం
– ఆసరా ఫించన్ కొత్త లబ్దిదారులతో ఆందోళన
తాండూరు, దర్శిని ప్రతినిధి : 57 ఏండ్లకే ఆసరా ఫించన్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత నెల ఆగస్టు 31 వరకు కొత్త ఫించన్ల దరఖాస్తుకు అవకాశం కల్పించింది. లబ్దిదారుల నుంచి ఎలాంటి రుసుము తీసుకోవద్దని మీ సేవా, ఈ సేవా నిర్వహకులను ఆదేశించింది. దీంతో లబ్దిదారులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. గతంలో 65 ఏండ్లకు మంజూరు చేస్తున్న ఆసరా ఫించన్ లబ్దిదారులు తాండూరు మున్సిపల్‌లో 6400ల మందికి పైగా ఉన్నారు. గత మూడేళ్లుగా కొత్త ఫించన్ కోసం లబ్దిదారులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన 57 ఏండ్లకే వృద్ధాప్య ఫించన్ దరఖాస్తుతో ఈ సంఖ్య మరింత పెరగబోతుంది.
విచారణపై అయోమయం
గతంలో ఆసరా ఫించన్ కోసం లబ్దిదారులు మున్సిపల్‌లో నేరుగా దరఖాస్తు చేసుకునే వారు. వచ్చిన ధరఖాస్తులను బిల్ కలెక్టర్, సంబంధిత అధికారి ద్వారా విచారణ జరిపి అర్హత ఉన్న వారికి ఫించన్ మంజూరుకు ప్రభుత్వానికి నివేధిక అందించేవారు. తాజాగా మీ సేవా, ఈ సేవాల ద్వారా దరఖాస్తులను ఆహ్వానించడంతో దరాఖాస్తుల విచారణపై స్పష్టత కొరవడింది. కుప్పలు తెప్పలుగా వచ్చిన దరఖాస్తులను ఏశాఖ వారు విచారణ చేస్తారో అనేది తెలియకుండా పోయింది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తేగాని చెప్పలేమని అధికారులు పేర్కొంటున్నారు.