చచ్చినోడు వేధిస్తున్నాడు..!

క్రైం జాతీయం తెలంగాణ హైదరాబాద్

చచ్చినోడు వేధిస్తున్నాడు..!
– 20 ఏండ్ల క్రితమే చంపా
– కాపాడమని పోలీసుల ముందు మొర
– సోషల్ మీడియాలో విచిత్ర ఫిర్యాదు వైరల్‌
దర్శిని డెస్క్‌: భార్యను వేధిస్తున్నాడని 20 ఏండ్ల క్రితమే వ్యక్తిని హత్య చేసిన వ్యక్తికి విచిత్ర పరిస్థితి ఎదురైంది. చంపినా కూడా కలలోకి వచ్చి వేధిస్తున్నాడని పోలీసులను ఆశ్రయించాడు. కాపాడమంటూ మొరపెట్టుకున్నాడు. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఫిర్యాదు ఛత్తీస్‌గఢ్‌లోని బాలోద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే..

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బాలోద్‌ జిల్లా కర్కాభాట్‌ గ్రామానికి చెందిన టికం కొలియారా అనే వ్యక్తి భార్యకు ఛబేశ్వర్‌ గోయల్‌ అనే వ్యక్తి స్నేహితుడు. కాని తన భార్య అని తెలిసినా ఛభేశ్వర్ గోయల్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో టికం కొలియారా ఛబేశ్వర్‌ గోయల్‌ను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని అడవిలో పాతిపెట్టాడు. ఈ సంఘటన దాదాపు 20 ఏళ్ల క్రితం జరిగింది. తాజాగా తాను హత్య చేసిన వ్యక్తి కలలోకి వచ్చి వేధిస్తున్నాడని గ్రామస్తుల ముందు చెప్పాడు. దీంతో గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు కొలియారాను అరెస్టు చేశారు. ఐతే కొలియారా చెప్పిన ఆధారాల ప్రకారం మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలంలో బుధవారం (ఏప్రిల్ 19) తవ్వకాలు చేపట్టగా.. వారికి ఎటువంటి మృతదేహం లభించలేదు. దీంతో కొలియారా మానసిక ఆరోగ్యం బాగాలేదని పోలీసులు అతన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

కానీ ఛవేశ్వర్‌ తండ్రి మాత్రం తన కొడుకు గత కొంతకాలంగా కనిపించడం లేదంటూ, ఆ ప్రాంతంలో మళ్లీ తవ్వకాలు జరపాలంటూ అధికారులను ఆశ్రయించాడు. దీంతో అధికారులు బుధవారం మరోసారి తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో డ్యామ్‌ పక్కన కొన్ని ఎముకలు, వస్త్రాలను గుర్తించారు. డీఎన్‌ఏ పరీక్షల కోసం వాటిని ల్యాబ్‌కు పంపినట్లు ఏఎస్పీ హరీశ్ రాథోడ్ మీడియాకు తెలిపారు.