ఆర్టీవో ఆఫీసుకు వెళ్లకుండా డ్రైవింగ్ లైసెన్స్‌లు
– డ్రైవింగ్ టెస్ట్ చేయకుండానే పొందే అవకాశం
– కొత్త రూల్స్ తీసుకవచ్చిన కేంద్ర ప్రభుత్వం
– మరి లైసెన్స్‌లు ఎలా పొందవచ్చంటే..?
దర్శిని డెస్క్: ఆర్టీఓ ఆసీపుతో పనిలేకుండా వాహనాదారులు డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకవచ్చింది. ఈ నిబంధనలతో లైసెన్స్‌లు పొందడంతో వాహనదారులకు ఊరట కలగనుంది. సవరించిన రూల్స్ ప్రకారం 2022 జూలై 1 ప్రభుత్వం డ్రైవింగ్ సెంటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అందించే అధికారాన్ని ఇచ్చింది. అయితే కొన్ని కండీషన్స్ పెట్టింది. ఆ అధికారం అన్ని సెంటర్లకు ఉండదు. కొన్ని అక్రెడిటెడ్ డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లకు మాత్రమే కల్పించింది. డ్రైవర్ ట్రైనింగ్ అనంతరం వారికి డ్రైవింగ్ లైసెన్స్ అందిస్తాయి. అంటే డ్రైవింగ్ టెస్ట్ లేకుండా డ్రైవింగ్ లెసెన్స్ వస్తోందని చెప్పుకోవచ్చు. గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్స్‌లో చేరి ట్రైనింగ్ తీసుకుని పరీక్షలో పాసైన వారు డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అర్హులు. డ్రైవింగ్ స్కూల్ ఇచ్చే ఈ సర్టిఫికెట్ ఆధారంగానే లైసెన్స్ జారీ అవుతుంది. వీటి ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి ఆర్‌టీవో ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సిన పని లేదు.
ఎలా జారీ చేస్తారంటే…?
డ్రైవింగ్ లైసెన్స్ ట్రైనింగ్ సిలబస్, డ్యురేషన్‌ని కేంద్రం వెల్లడించింది. తొలుత దరఖాస్తుదారుడి వయసు 18 ఏళ్లు ఉన్నాయా చెక్ చేయాలి. లైట్ మోటార్ వెహికల్స్ వరకు లైసెన్స్ కోసం నాలుగు వారాల పాటు ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ సిలబస్‌ని రెండు విధాలుగా విభజించారు. ఒకటి థియరీ, రెండోది ప్రాక్టికల్. మొత్తంగా ట్రైనింగ్ సెషన్‌లో 29 గంటల పాటు క్లాసులు నిర్వహించాలి. ఇందులో 21 గంటలు ప్రాక్టికల్ క్లాసులు అంటే.. రోడ్డుపై డ్రైవింగ్ శిక్షణ, మిగిలిన 8 గంటలు థియరీ క్లాసులు నిర్వహించాలి. అదే హెవీ వెహికల్స్ లైసెన్స్ కోసమైతే శిక్షణ కాలం ఆరు వారాల పాటు కొనసాగాలి. 8 గంటలు థియరీ, మరో 31 గంటలు ప్రాక్టికల్ తరగతులు జరపాలి. డ్రైవింగ్ ట్రైనింగ్ కోసం ఏర్పాటు చేసిన ట్రాక్‌ని పై అధికారులు చెక్ చేయాల్సి ఉంటుంది.
నిబంధనలు తప్పని సరి..
డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలంటే వారు దరఖాస్తుదారులకు కొన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. టూ వీలర్, త్రీ వీలర్, నాన్ ట్రాన్స్‌పోర్ట్ లైట్ మోటార్ వెహికల్స్ లైసెన్స్ కోసం ట్రైనింగ్ ఇచ్చేందుకు ఎకరం ఖాళీ ప్రదేశం కలిగి ఉండాలి. అదే హెవీ వెహికల్స్ కోసమైతే కచ్చితంగా 2 ఎకరాలు ఉండాలి. ట్రైనర్‌కి కనీసం 5 ఏళ్ల పాటు డ్రైవింగ్లో అనుభవం ఉండాలి. దీంతో పాటు కనీస విద్యార్హత 12వ తరగతి పాసై.. ట్రాఫిక్ నియమాల గురించి పూర్తిగా తెలిసి ఉండాలి.

