చైర్ పర్సన్‌కు అవమానం..!
– దశాబ్ది ఉత్సవాల్లో కుర్చీ ఇవ్వకుండా పరాభవం
– వెనక్కి తిరిగి వెళ్లిపోయిన పట్టణ ప్రధమ పౌరురాలు
– సోషల్ మీడియాలో అధికారులపై విమర్శలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్‌కు అవమానం జరిగింది. ఉత్సవాల్లో వేధికపైకి పిలిచి ముందు వరుసలో కూర్చోనివ్వకుండా చేయడంతో పరాభవం ఎదురయ్యింది. దీంతో పట్టణ ప్రథమ పౌరురాలు తిరిగి ఇంటికి వెళ్లిపోయినట్లు సోషల్ మీడియాలో కథనాలు విస్తరించాయి. అధికారుల నిర్లక్ష్యమంటూ విమర్శలు వినిపించాయి. సోషల్ మీడియా కథనం మేరకు అసలేం జరిగిందంటే.. శుక్రవారం తాండూరు పట్టణంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ ఉత్సవాలు పండగలా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ఆర్డీఓ అశోక్ కుమార్, డీఎస్పీ శేఖర్ గౌడ్, మున్సిపల్ కమీషనర్ శంకర్ సింగ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ముందుగా జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యేతో పాటు చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కూడా పాల్గొన్నారు. అనంతరం కళాశాల మైదానంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ కూడా ఎమ్మెల్యేతో పాటు చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ పక్కనే ఉన్నారు. అనంతరం వేధికపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, అధికారులు కూర్చున్నారు. ఈ క్రమంలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ పేరును కూడా పిలిచి ఆహ్వానించారు. అప్పటికే ఎమ్మెల్యే పక్కన ముందు వరుసలో గ్రంథాలయ చైర్మన్, ఆర్డీఓ, డీఎస్పీ, కమీషనర్ అందరు కూర్చున్నారు. ప్రోటోకాల్ ప్రకారం.. ముందు వరుసలో కూర్చోవాలని చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ భావించారు. కాని కుర్చీలు లేకపోవడంతో వెనక నుంచి మరో కుర్చీ ఇవ్వాలని కోరారు. వెనక్కి వెళ్లి కూర్చోవాలని అక్కడి వారు సూచించారు. ఎమ్మెల్యే ముందే అవమాన భారంగా భావించిన చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ వేధికపై నుంచే వెనుదిరిగి వచ్చేశారు. ఒక్కక్షణం కూడా అక్కడ ఉండకుండా ఇంటికి వెళ్లిపోయారు. ఈ సంఘటన తాండూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికారుల నిర్వహణ ఏర్పాట్లతోనే చైర్ పర్సన్‌కు అవమానం చేశారని పలువురు విమర్శించారు.
ఇది కూడా చదవండి…
త్వరలో నా పెళ్లి..!
– నేను జైలుకు వెళ్లనంటే వెళ్లను
– కోర్టులో రిమాండ్ ఖైదీ హంగామా
– కోర్టులోనే తలుపు అద్దాలు ధ్వసం
https://dharshininews.com/17509


