బీసీ కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి శుభవార్త..!
– రూ. లక్ష ప్రభుత్వ సాయం దరఖాస్తుకు అవకాశం
– అప్లై ఎలా చేసుకోవాలంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణలోని బీసీ కులవృత్తులు, చేతివృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ. లక్ష ప్రభుత్వ ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. మేరకు దీనికి సంబంధించిన వెబ్సైట్ను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు.

రాష్ట్రంలోని చేతి, కులవృత్తిదారులకు ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. నాయీబ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, కుమ్మరి, మేదరి, రజక, పూసల వర్గాలతో పాటు.. మరిన్ని కులాలను గుర్తించిన ఉపసంఘాల అర్హులకు ఈ ఆర్థిక సహాయాన్ని అందించేందుకు సిద్దమైంది. ప్రతి నియోజకవర్గంలో 1200 నుంచి 1500 మందికి లబ్ధి చేకూర్చేలా కసరత్తు చేస్తోంది. ఎలాంటి పూచీకత్తు లేకుండా పూర్తి సబ్సిడీతో రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించనుంది. ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తొలివిడత పథకాన్ని ప్రకటించనుంది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?
ఆర్థిక సాయం కోసం https://tsobmmsbc.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. ఫొటో, ఆధార్, కులధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మంచిర్యాల జిల్లాలో ఈనెల 9న ₹లక్ష ఆర్థిక సాయం పంపిణీని ప్రారంభించనున్నారు.





