గులాబీ జోష్‌..!

తాండూరు రాజకీయం వికారాబాద్

గులాబీ జోష్‌..!
– పైలెట్‌ కోసం తరలొచ్చిన జనం
– గెలిచేది నేనేనని తొడగొట్టిన ఎమ్మెల్యే పైలెట్
– తాండూరులో పరాయోల్లకు స్థానం లేదు
– అట్టహాసంగా నామినేషన్ ర్యాలీ
– ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి నామినేషన్ దాఖలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో గులాబీ పార్టీ జోష్‌ పుల్‌గా కనిపించింది. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కోసం నియోజకవర్గంలోని వివిద ప్రాంతాల నుంచి గులాబీ దండు కదిలొచ్చింది. గురువారం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రెండో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. పట్టణంలోని నివాసంలో వేద పండితులతో పూజలు, ముస్లిం మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనాలు చేశారు. నామినేషన్ దాఖలును పురస్కరించుకుని తాండూరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి ర్యాలీ చేపట్టారు. అక్కడి నుంచి ఇందిరా చౌరస్తా, మల్లప్ప మడిగ, శివాజీ చౌరస్తా మీదుగా విజయ విద్యాలయ పాఠశాల వరకు ర్యాలీ కొనసాగింది.

ఈ ర్యాలీలో చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. గులాబీ జెండాలతో నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి తాండూరు పట్టణంలోని పలు వార్డుల నుంచి నేతలు.. కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పురవీధులు మొత్తం గులాబీ మయంగా మారాయి. రహదారులు మొత్తం జనసంద్రోహంతో నిండిపోయింది. ర్యాలీలో వాహనం నుంచి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. చేతులెక్కి మొక్కి ఆదరించాలని కోరారు. నేతలు, కార్యకర్తల అభిమానంకు అనుగుణంగా పైలెట్ రోహిత్ రెడ్డి పలు రకాలుగా అభివాదాలు చేసి ఆకట్టుకున్నారు. కార్యకర్తలు, నేతలు కూడా జోష్ మీద ముందుకు సాగారు. జై రోహితన్న అంటూ విన్యాసాలను ప్రదర్శించారు.

అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ నేతలు, కార్యకర్తల అభిమానంకు ధన్యవాదాలు తెలిపారు. తాండూరులో కొనసాగిన నామినేషన్ ర్యాలీ విజయోత్సవ ర్యాలీని తలపించిందన్నారు. ఇంటోనికి బయటోనికి మద్య ఈ అసెంబ్లీ పోరు సాగుతోందని అన్నారు. దొంగలు, విచ్చిన్న శక్తులు ఏకమై తాండూరు పై కుట్రలు పన్నుతున్నారని అన్నారు. డబ్బు సంచులతో తాండూరు ప్రజల ఆత్మాభిమానాలను కొనలేరని అన్నారు. తాండూరు భవిష్యత్తుతో ఆడుకుంటున్న శక్తులకు గుణపాఠం చెప్పాలన్నారు. స్వార్ధ ప్రయోజనాలకు వచ్చిన వారికి ఇక్కడ స్థానం లేదన్నారు.

తాండూరులో నిలిచేది.. నేనే.. గెలిచేది.. నేనే అంటూ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ హవా కొనసాగుతోందని అన్నారు. తాండూరుతో పాటుతో జిల్లాలో అన్నిస్థానాలను కారు కైవసం చేసుకుంటుందన్నారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే తల్లి ప్రమోదిని రెడ్డి, తండ్రి విఠల్ రెడ్డి. సతీమణి ఆర్తిరెడ్డి. సోదరుడు రితేష్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తం రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ (నయూం), నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, నేతలు, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు. ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

 మోసపోవద్దు గొసపడతాం..