తాళాలు విరగ్గొట్టే టక్కరి దొంగ..!

క్రైం తాండూరు వికారాబాద్

తాళాలు విరగ్గొట్టే టక్కరి దొంగ..!
– ఏడు జిల్లాల్లో ఒక్కడిపైనే 42 కేసులు
– అంతర్ జిల్లా దొంగ ఆటకట్టించిన పోలీసులు
– వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఐపీఎస్
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : తాళాలు వేసిన ఇండ్లే అతడి టార్గెట్. ఇండ్లకు వేసిన తాళాలను ఈజీగా విరగ్గొట్టి అందిన కాడికి దోచుకోవడం అతని స్పెషాలిటీ. ఇప్పటి వరకు ఏడు జిల్లాల్లో హాఫ్‌ సెంచరీకీ దగ్గరగా చోరీలు చేశాడు. 36 కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినా చోరీలు చేయడం మానలేదు. దీంతో వికారాబాద్‌ జిల్లా పోలీసులు అంతర్ జిల్లా దొంగ ఆటకట్టించి కటకటాల వెనక్కి పంపించారు. శనివారం వికారాబాద్‌ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఐపీఎస్ కేసు వివరాలను వెల్లడించారు.

గత యేడాది డిసెంబర్, ఈనెల 7న వికారాబాద్‌ జిల్లాలోని నవాబ్ పేట్, వికారాబాద్ పోలీస్టేషన్‌ పరిధిలో చోరీలు జరిగాయి. ఈచోరీలపై జిల్లా పోలీసు యంత్రాంగం సీరీయస్‌గా తీసుకుంది. కేసుల చేధన కోసం ప్రత్యేక బృందాలతో విచారణ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా నవాబ్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పులుమామిడి గేటు దగ్గర మోమిన్ పేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, CCS ఇన్స్పెక్టర్ బలవంతయ్య, CCS సిబ్బంది, నవాబ్ పేట్ SI భరత్ భూషణ్, సిబ్బంది శనివారం ఉదయం 05:00 గంటల నుండి వాహనాల తనిఖీలు చెస్తుండగా యూనికాన్ బైక్ నెంబర్(TS 15 EW 5516)పై వచ్చిన ఒక వాహనదారుడు పోలీస్ అధికారులను చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

దొంగగా మారిన లేబర్
పోలీసుల విచారణలో నిందతుడు సన్నిధి ఆంజనేయులు(30) లేబర్/మేస్త్రి పనిచేన వ్యక్తిగా గుర్తించారు. ఇతని స్వస్థలం సూర్యపేట జిల్లా, హుజూర్ నగర్‌ మండలం కరక్కాయల గూడెంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. జల్సాల కోసం అలవాటు పడి దొంగతనాలకు పాల్పడినట్లు అతని మాటల్లో నిర్దారించారు.

ఈ క్రమంలోనే ఈనెల 7న రాత్రి నవాబ్ పేట్ పోలీస్టేషన్‌ పరిధి వట్టిమినేపల్లిలో ప్రజలు ఎవ్వరూ లేరని గమనించి ఆ గ్రామంలో దొంగతనం చేశారు. బంగారు మరియు వెండి ఆభరణాలు మరియు 60 వేల రూపాయల నగదును అపహరించాడు. అదేవిధంగా గత యేడాది తేది 11న వికారాబాద్ పట్టణం అస్సాం బేకరీ దగ్గరలో ఒక ఇల్లు తాళం వేసి ఉండటాన్ని గమనించి, లోపలికి వెళ్లి డోర్ యొక్క తాళాన్నితన వెంట తెచ్చుకున్న ఇనుపరాడ్డుతో విరగొట్టినాడు.ఇంటిలోకి ప్రవేశించి ఇంట్లో కబోర్డ్ లో ఉన్న వెండి మరియు బంగారం ఆభరణాలను దొంగలించినాడు.

36 కేసుల్లో జైలుకు
తాళంలో వేసిన ఇండ్లలో చోరీలు చేసే అంజి 36 కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. నేరస్థుడు ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలో 25 కేసులు, ఖమ్మం జిల్లాలో 4 కేసులు, వరంగల్ జిల్లాలో 4 కేసులు, సిద్ధిపేట జిల్లాలో 2 కేసులు మరియు సంగారెడ్డి జిల్లాలో 1 కేసు మొత్తం (36) దొంగతనం కేసులలో జైలుకు వెళ్లాడు. తాజాగా నేరస్థున్ని నవాబ్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు, వికారాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు, కోదాడ పోలీస్ స్టేషన్ పరిధిలో 04 కేసులలో ఆరెస్ట్ చేయడం జరుగుతుంది. వివిధ జిల్లాలలో ఉన్న కేసులతో పాటుగా ఈ 06 కేసులను కలుపుకొని మొత్తం నేరస్థుని పైన 42 కేసులు నమోదు అయ్యాయి.

బంగారం, వెండి, బైకులు స్వాదీనం
పోలీసుల తనిఖీలలో పట్టుబడిన నిందితుని నుంచి మొత్తం (6) కేసులలో కలపి 30.3 తులాల బంగారం, 1.40 కేజీల వెండి, మూడు బైక్ లు (యూనికన్ , గ్లామర్, రాయల్ ఎంఫిల్డ్ ) లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వెల్లడించారు. ఈ కేసును త్వరతగతిన ఛేదించిన మోమిన్ పేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, CCS ఇన్స్పెక్టర్ బలవంతయ్య, CCS సిబ్బంది మరియు నవాబ్ పేట్ SI భరత్ భూషణ్ మరియు సిబ్బంది ని అబినంధించి వారికి రివార్డు ప్రకటించారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!