రంజాన్‌ పండగకు పకడ్బందీ ఏర్పాట్లు

తాండూరు రాజకీయం వికారాబాద్

రంజాన్‌ పండగకు పకడ్బందీ ఏర్పాట్లు
– మసీదులు, దర్గాల వద్ద పారిశుద్ధ్య పనులు నిర్వహించాలి
– అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: ముస్లిం సోదరుల పవిత్ర పండగ రంజాన్‌ పండగకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం తాండూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్, పోలీసు, ఆర్టీసీ తదితర శాఖల అధికారులతో రంజాన్ పండగ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదరులు రంజాన్ పండగను అత్యంత పవిత్రంగా జరుపుకుంటారని అన్నారు. రంజాన్ మాసం ప్రారంభమయ్యిందన్నారు. ప్రతి యేడాది మాదిరిగానే ఈ సారి కూడా రంజాన్ పండగకు ఏర్పాట్లు చేయాలన్నారు. మసీదులు, దర్గాల వద్ద ప్రతి రోజు పారిశుద్ధ్య పనులు నిర్వహించాలన్నారు.

తాగునీరు, విద్యుత్ సదుపాయాల్లో ఎలాంటి ఇబ్బందు రాకుండా దృష్టి సారించాలన్నారు. పండగ ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పోలీసు శాఖ నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ముస్లిం సోదరులతో పాటు ఏకత్వం చాటేలా పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, అబ్దుల్ రవూఫ్‌, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, ఆర్టీసీ డీఎం సమతారెడ్డి, పట్టణ సీఐ సంతోష్‌ కుమార్, ఎస్ఐ కాశినాథ్, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!