వైరాగ్యంలో వైకుంఠదామాలు
– ఏండ్లు గడుస్తున్న ప్రారంభంకాని పనులు
– స్మశాన వాటికలలో వసతులు లేక ఇబ్బందులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మనిషి జీవిత గమనంలో చివరి మజిలీ అంతిమయాత్ర.. బతికి ఉన్ననాళ్లు…ఎన్నో కష్టాలు, నష్టాలకు, దుఃఖాలకు లోనయి అలసిపోయిన దేహం చివరకు స్మశానవాటికకు చేరుకుంటుంది. అటువంటి స్మశాన వాటికలను పరిశుభ్రంగా మారుస్తోంది తెలంగాణ ప్రభుత్వం. బతికి ఉన్నప్పుడు ఎలా జీవించినా, చనిపోయిన తర్వాత మాత్రం దహన సంస్కారాలు గౌరవప్రదంగా చేసి అంతిమ యాత్ర సాఫిగా జరగాలని ప్రతి మనిషి
కోరుకుంటాడు. అందుకోసం తెలంగాణ సర్కారు ఏర్పడిన తరువాత స్మశాన వాటికలను వైకుంఠ దామాలుగా మార్చి ఏర్పాట్లను చేస్తోంది. ఇందులో భాగంగా తాండూరు మున్సిపల్ పరిధిలో కూడ వైకుంఠ దామాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికీ ఏండ్లు గడుస్తున్నా పనులు ప్రారంభం కాకపోవడంతో వైకుంఠ దామాలకు వైరాగ్యం అలుముకుంది. తాండూరు పట్టణంలోని పోలీస్టేషన్ వెనుకాల ఉన్న బీసీ స్మశాన వాటికతో పాటు మున్సిపల్ పరిధి పాత తాండూరు
బోనమ్మ దేవాలయం సమీపంలోని బీసీ స్మశాన వాటికను వైకుంఠ దామాలుగా ఎంపిక చేశారు. పోలీస్టేషన్ సమీపంలో ఉన్న బీసీ స్మశాన వాటికను 2016 కంటే ముందే ఎంపిక చేశారు. ఇక పాత తాండూరులోని బీసీ స్మశాన వాటికను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి రెండో విడతలో ఎంపిక చేశారు. పోలీస్టేషన్ సమీపంలో ఒక ఎకరా స్థలంలో నిర్మించే వైకుంఠ దామానికి.. పాత తాండూరులో మరో ఎకరా స్థలంలో నిర్మించే వైకుంఠ దామానికి ఒక్కో కోటి చొప్పున నిధులను కూడ మంజూరు చేశారు. ఈ వైకుంఠ దామాలలో దింపుడు కల్లెం, ఫుట్ ఫాత్‌లు, నీటి సౌకర్యం, ప్రత్యేక గదులు, బర్నింగ్ రూం వంటి తదితర సదుపాయాలను కల్పించాల్సి ఉంటుంది. అయితే ఏండ్లుగా ఆయా స్మశాన వాటికల్లో పనులు ప్రారంభం కాకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగి అపరిశుభ్రంగా తయారయ్యాయి. అంతిమ
సంస్కారాలకు వచ్చే మృతుల బందువులకు సరైన దారులు, వసతులు లేక తీవ్ర అవస్థతలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వైకుంఠ దామాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.
టెండర్లు ప్రాసెస్‌లో ఉన్నాయి: మున్సిపల్ ఏఈ
తాండూరు పట్టణంలోని వైకుంఠ దామాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. ప్రత్యేక ప్రణాళికలు కూడ సిద్దం చేయడం జరిగింది. వైకుంఠ దామాల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించాం. ప్రక్రియను పూర్తి చేసిన వెంటనే నిర్మాణ పనులను ప్రారంభిస్తాం.
గతంలో ఎన్నోసార్లు వినతులు : రాజ్ కుమార్, బీసీ సంఘం కన్వీనర్

వైకుంఠ దామాల విషయంలో బీసీ సంఘం తరపున అధికారులకు, నాయకులకు ఎన్నోసార్లు వినతిపత్రాలు అందజేశాం. స్మశానా వాటికలను అభివృద్ది పరచాలని మంత్రులకు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆర్డీఓ, మున్సిపల్ చైర్ పర్సన్ ల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వైకుంఠ దామాలకు నిధులున్నా అభివృద్ది పరచడం లేదు. స్మశాన వాటికల్లో సౌకర్యాలు, సదుపాయాలు లేక అంత్యక్రియలకు వచ్చిన వారంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా వైకుంఠధామం వాళ్లను అభివృద్ధి పరచాలని కోరుతున్నాం.


