మళ్లీ బహిరంగ వేలం..!
– మాంసం వ్యర్థాల సేకరణకు దరఖాస్తుల ఆహ్వానం
– తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో మాంసం వ్యర్థాల సేకరణ, రవాణా, నిర్వీర్యం చేసే ఏజెన్సీల నియామకం కోసం మళ్లీ బహిరంగ వేలం వేసేందుకు నిర్ణయించినట్లు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. మున్సిపల్ యాక్టు-2019 సెక్షన్ 52 కింద 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పట్టణ పరిధిలో చికెన్, మటన్, చేప మాంసాల వ్యర్థాలను సేకరణ, సైంటిఫిక్ డిస్పోజల్ చేసేందుకు అనుభవం ఉన్న కంపెనీల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు స్పష్టం చేశారు. దరఖాస్తులు అందజేసే వారు మున్సిపల్ కమీషనర్ కార్యాలయం పేరుపై రూ. 5వేల డీడీ చెల్లించి, ఈనెల 27వ తేది సాయంత్రం 4 గంటల్లోపు రెవెన్యూ విభాగంలో పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు.
వచ్చిన దరఖాస్తులలో 28వ తేది మున్సిపల్ కార్యాలయంలో బహిరంగ వేలం వేయడం జరుగుతుందని తెలిపారు.
నిబంధనలు ఇవే…
వేలంలో పాల్గొనే వారు సంబంధిత కంపెనీల నుంచి అనుమతి, సేఫ్ డిస్పోజల్ సర్టిఫికెట్ కలిగి ఉండాలన్నారు. అంతేకాకుండా వేలంలో పాల్గొనే వారు రూ. 1లక్ష నగదు లేదా డీడీలు అందించాల్సి ఉంటుందని అన్నారు. వేలంలో పాల్గొనే వారిపై ఎలాంటి కేసులు నమోదు అయి ఉండరాదని స్పష్టం చేశారు. సొంతంగా లేదా లీజుతో కనీసం రెండు వాహనాలను కలిగి ఉండాలని అన్నారు. వేలం దక్కించుకున్న వారు డిపాజిట్ చేసిన రూ. 1 లక్షతో పాటు మిగతా సొమ్మును 7 రోజులలో చెల్లించాల్సి ఉంటుందని,
ఒకవేళ వాయిదా పద్దతిన చెల్లించే అవకాశం అగ్రిమెంట్ ద్వారా పొందవచ్చన్నారు. డబ్బులు చెల్లించకుంటే రెండో స్థానంలో ఉన్న వేలం దారునికి షరతులను అప్పగించవచ్చని స్పష్టం చేశారు. ముఖ్యంగా బహిరంగ వేలంను ఎలాంటి పరిస్థితులలో అయినా రద్దు చేసే అధికారం మున్సిపల్ కు ఉంటుందని పేర్కొన్నారు. ఇదే వేలంలో గత జులై మాసంలో వేలం నిర్వహించారు. అప్పట్లో సరైన స్పందన లేకపోవడంతో తాజాగా మళ్లీ బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు.
ఇదికూడా చదవండి…

