కొత్త రేషన్ కార్డు లబ్దిదారులకు గుడ్ న్యూస్..!
– జారీలో మార్గదర్శకాలు విడుదల చేసిన సర్కారు
– పాత కార్డులో చేర్పులకు, మార్పులకు అవకాశం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణలోని పేదలకు సీఎం రేవంత్ రెడ్డి సర్కారు శుభవార్త చెప్పింది. ఈనెల 26 నుంచి మంజూరు చేయనున్న కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న వినతుల పరిష్కారం దిశగా సర్కారు ముందడుగు వేస్తూ చర్యలు చేపట్టింది. కొత్త రేషన్ కార్డుల మంజూరుతోపాటు.. పాత రేషన్ కార్డులలో మార్పులు, చేర్పులు కూడా చేయనున్నారు.
మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. దరఖాస్తులను నిశితంగా పరిశీలించిన తర్వాత కుల గణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం పంపిస్తారు. మండల స్థాయిలో ఎంపీడీవో, యూఎల్‌బీలో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులుగా వ్యవహరిస్తారు. ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డులో ప్రదర్శించి, చదివి వినిపించి చర్చించిన తర్వాత ఆమోదం లభించనుంది. ఆహార భద్రత కార్డుల్లో సభ్యుల చేర్పులు, మార్పులు జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదికూడా చదవండి…

