నమో.. భూకైలాసా వాసా…!

తాండూరు రాజకీయం వికారాబాద్

నమో.. భూకైలాసా వాసా…!
– ద్వాదశ జ్యోతిర్లింగాలకు పోటెత్తిన భక్తులు
– బ్రహ్మోత్సవాలకు హాజరైన మహారాష్ట్ర మంత్రి సంజయ్ రాథోడ్
– మహా శివున్ని దర్శించుకున్న ఎమ్మెల్సీలు మహేందర్ రెడ్డి, రాములు నాయక్
– పూజలు నిర్వహించిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– అట్టహాస బ్రహ్మోత్సవ కార్యక్రమాలతో ఆధ్యాత్మిక శోభ
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : నమో.. భూకైలాసా వాసా… అంటూ భక్తులు తాండూరు మండలం అంతారం వాసునాయక్ తాండాలో వెలసిన భూకైలాస్ మహా శివున్ని వేడుకున్నారు. బుధవారం భూకైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగాల దేవాలయంలో మహశివరాత్రి బ్రహ్మోత్సవాలు, జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం రాష్ట్రపతి అవార్డు గ్రహీత శంకర్ పవార్ నాయక్, శాంతి పవార్ దంపతులు, వాసునాయక్ పవార్, ఇందిరాపవార్, శాంతిపవార్ దంపతులతో పాటు కుటుంబ సభ్యులు సోరంగ మార్గంలో నుంచి ద్వాదశ జ్యోతిర్లింగాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ గర్భగుడిలో మహా శివునికి ఏకాదశ రుద్రాభిషేకము, రుద్రహోమము భక్తిప్రపత్తులతో నిర్వహించారు.

మరోవైపు మధ్యాహ్నం పల్లకి సేవలో అమ్మవారి ఊ రేగిపు చేపట్టారు. అంతారం తాండాలోని గిరిజన మహిళలు బోనాలతో అమ్మవారికి, దేవతామూర్తులకు నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

దర్శించుకున్న మహారాష్ట్ర మంత్రి సంజయ్ రాథోడ్
భూకైలాస్లో జరిగిన బ్రహ్మోత్సవాలకు మహరాష్ట్రకు చెందిన నేల, నీటి సంరక్షణ మంత్రి సంజయ్ రాథోడ్ సతీమణి, కుమారుడతో కలిసి హాజరయ్యారు. ప్రత్యేక హెలిక్యాప్టర్ ద్వారా భూకైలాస్ కు చేరుకున్న మంత్రికి రాష్ట్రపతి అవార్డు గ్రహీత శంకర్ నాయక్ పవార్, వాసు పవార్ నాయక్ పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు.

మంత్రి రాక సందర్భంగా గిరిజన మహిళలు వారి సంప్రదాయ నృత్యాలతో ఆహ్వానించారు. అదే సమయంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వారి వద్దకు చేరుకున్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ రాములు నాయక్ కూడా బ్రహ్మత్సవాలలో పాల్గొన్నారు. ఓ వైపు మంత్రి సంజయ్ రాథోడ్ సొరంగ మార్గంలో ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటూ గర్భగుడిలోని మహా శివుని వద్దకు చేరుకున్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహా శివునికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.

జలాభి షేకంతో పాటు పాలాభిషేకం నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మంత్రి కుటుంబ సభ్యులు శంకర్ నాయక్ కుటుంబ సభ్యులు హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం శంకర్ నాయక్ కుటుంబ సభ్యులు మంత్రి కుటుంబ సభ్యులకు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. పూజల అనంతరం మంత్రి సంజయ్ రాథోడ్ హెలీప్యాడ్‌లో బయల్దేరి వెళ్లిపోయారు. శంకర్ నాయక్ పవార్, వాసు నాయక్ పవార్‌లు హెలీప్యాడ్ వద్దకు చేరుకుని వీడ్కోలు పలిశారు.

వేరువేరుగా దర్శించుకున్న చీఫ్ విఫ్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
భూకైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగాలను మహా శివరాత్రి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర చీఫ్ విఫ్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు వేరు వేరుగా దర్శించుకున్నారు. ముందుగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి డీసీసీబీ జిల్లా వైస్ చైర్మమ రవీందర్ గౌడ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు ఉత్తమ్ చంద్, ఏఎంసీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీగౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ నర్సింహారెడ్డిలతో కలిసి మహా శివున్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం చీఫ్‌ విప్ మహేందర్ రెడ్డి నేతలు కరణం పురుషోత్తంరావు, బిడ్కర్ రఘు, మాజీ సర్పంచ్ రాంచందర్, గడ్డలి రవీందర్ పలువురుతో కలిసి మహా శివున్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. వేద పండితులు మహేందర్ రెడ్డికి ఆశీర్వదించారు.

మహశివరాత్రి భక్తులతో కిట కిటలాడిన భూకైలాస్
మహశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భూకైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగా దేవాలయానికి భక్తుల రాకతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కిటకిటలాడింది. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు గంటల తరబడి నిలుచుని శివలింగాన్ని దర్శించుకున్నారు.

తాండూరు పట్టణంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ఆటోలు, ద్విచక్ర, పెద్ద వాహానాల్లో కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్నారు. ముందుగా సొరంగా మార్గం గుండా వెళ్లి శివున్ని దర్శించుకున్నారు. అనంతరం ఆహ్లాదకర వాతావరణంలో వెలసిన సకల దేవతామూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలోనే ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులు ఫలహారాలు తీసుకుని దీక్షలను విరమించారు. మరోవైపు భూకైలాస్లో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

ఇదికూడా చదవండి…

దేవాలయ అభివృద్ధికి కృషి చేయండి