విద్యా, ఆరోగ్యంపై దృష్టి తప్పనిసరి..!
– స్కూళ్లలో విద్యార్థులకు ఇబ్బందులు రావొద్దు
– మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లో కమిషనర్ తనిఖీ
-జినుగుర్తి కేజీబీవీ స్కూల్లో మున్సిపల్ మేనేజర్ పరిశీలన
– జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పాఠశాలల సందర్శన
(తాండూరు/తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి)
గురుకుల, మోడల్ స్కూళ్లలో విద్యార్థులకు విద్యతో పాటు వారి ఆరోగ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, మేనేజర్ నరేందర్ రెడ్డిలు సూచించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాల మేరకు బుధవారం తాండూరు పట్టణం రాజీవ్ కాలనీ సమీపంలోని తెలంగాణ మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ స్కూల్, హాస్టల్ ను మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తనిఖీ చేశారు.

అదేవిధంగా తాండూరు మండలం జినుగుర్తి గేటు సమీపంలోని కస్తూరీబా గురుకుల పాఠశాల (కేజీబీవీ)ని పరిశీలించారు. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి క్లాస్ రూంలు, మరుగుదొడ్లు, వంట గదితో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి విద్య ఎలా బోధిస్తున్నారని, భోజనం ఎలా అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మరోవైపు జినుగుర్తి కేజీబీవీలో మేనేజర్ నరేందర్ రెడ్డి కూడా స్కూల్ తరగతి గదులు, వంట గది, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. ఈ తనిఖీలో విద్యార్థులకు డైనింగ్ హాల్ లేక ఇబ్బందులు పడుతున్నారని, పలువురు విద్యార్థులు అస్వస్తతకు గురైనట్లు గుర్తించారు.

మెను ప్రకారం భోజనం వడ్డించడం లేదని మేనేజర్ నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కమీషనర్, మేనేజర్ లు వేరు వేరుగా మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్కూళ్లలో మెరుగైన విద్య అందించడంతో పాటు విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలని అన్నారు. ఇందులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలకు గురికాక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో జినుగుర్తి స్పెషల్ ఆఫీసర్ ఆశలత, తాండూరు మున్సిపల్ ఆర్వ అశోక్ కుమార్, జవాన్లు సిహెచ్ అశోక్, సాయి ప్రసాద్ తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

