రాత్రివేళ ఊళ్లపై వాలిన డ్రోన్లు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

రాత్రివేళ ఊళ్లపై వాలిన డ్రోన్లు..!
– బేంబేలెత్తిన పల్లె జనాలు
– రహస్యమేంటో తేల్చని అధికారులు
– ఇంకా టెన్షన్‌ వీడని ప్రజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అవి మామూలు ఊళ్లు. అప్పుడే జనాలు భోజనాలు చేసి.. పనులు అన్ని ముగించుకుని కునుకు తీసేందుకు సిద్దమయ్యారు. సరిగ్గా అర్దరాత్రికి ముందు ఆ ఊళ్లపై సుడిగాలిలా శబ్దాలు చేస్తూ వింత యంత్రాలు వాలిపోయాయి.

శబ్దాలు విన్న జనాలు బయటకు పరుగులు తీశారు. సెల్ ఫోన్లలో యంత్రాలను చిత్రీకరించారు. తీరా అవి డ్రోన్లుగా గుర్తించారు. ఈ సంఘటన పెద్దేముల్ మండలంలో తీవ్ర ఉత్కంఠతతో పాటు ఆందోళనకు గురిచేసింది. శుక్రవారం రాత్రి మండలంలోని నర్సాపూర్, ఆత్కూర్, రుద్రారం, ఇందూరు, పెద్దేముల్ తాండా గ్రామాల్లో రాత్రి వేళ డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. గబ్బిలాల మాదిరిగా డ్రోన్లు వాలిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోయారు. బయటకు వచ్చి.. డ్రోన్లు ఎందుకు తిరుగుతున్నాయో అంటూ అయోమయానికి గురయ్యారు.
kvcs
సెల్ ఫోన్లలో చీకట్లలో కనిపించని డ్రోన్లను చిత్రీకరించారు. వెంటనే పెద్దేముల్ పోలీసులకు సమాచారం అందించారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు డ్రోన్ల విహారంపై పెద్దేముల్ మండలంలో చర్చలు జరిగాయి. అర్దరాత్రి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించినప్పటికి ఎలాంటి విషయాలు బహిర్గతం కాలేదు. డ్రోన్లు ఎందుకు తిరిగాయని రహస్యాలను కనిపెట్టలేకపోయారు. ఈ విషయంపై ప్రభుత్వం నుంచి గాని, పరిశ్రమల నుంచి గాని ఎలాంటి సమాచారం అందలేదని చెప్పుకొచ్చారు. రక్షణ శాఖకు ఏమైనా సంబంధించినవా అనే దానిపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసు అధికారి వెల్లడించారు. కాని ఆయా గ్రామాల ప్రజలు మాత్రం డ్రోన్లు తిరగడం పట్ల భయాందోళనను వీడడం లేదు.

ఇదికూడా చదవండి…

కోస్గి ఎంపీడీఓగా కుర్వ క్రాంతి..!