హస్తంలో మనోహర మంత్రం..!
– పక్కా ప్రణాళిక, సీనియర్లతో ముందుకు వెళ్తున్న ఎమ్మెల్యే
– మున్సిపల్ గెలుపుతో పాటు క్యాడర్ నిర్మాణం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికలను కేవలం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమే కాకుండా పార్టీకి పట్టణంలో కేడర్ తయారు చేసేందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా గతంలో పార్టీ అంతర్గత కొమ్ములాటలలో మూడు దశాబ్దాలుగా అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందన్న సీనియర్ల సూచన మేరకు మున్సిపల్ ఎన్నికల్లో ఆ పరిస్థితిని కట్టడి చేసేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారు.

గత కొంతకాలంగా అన్నిటికీ తానే కేంద్రంగా మారుతూ గ్రూపు తగాదాలను లేకుండా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చాకచక్యంగా వ్యవహరించారు. తాండూరు ప్రాంతానికి చెందిన కల్వ సుజాతకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి ఇప్పించడంలో ఎమ్మెల్యే ప్రధాన పాత్ర పోషించారు అంతేకాకుండా మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న మహారాజుల కుటుంబం నుండి రమేష్ మహారాజుకు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యుడిగా పదవిని ఇప్పించడం…అంతే కాకుండా బషీరాబాద్ సర్పంచ్ స్థానంలో వెంకటేష్ మహారాజు గెలిపించుకోవడంతో ఎమ్మెల్యే ఒక వర్గానికి స్థానం కల్పించినట్టు కార్యకర్తల్లో మెసేజ్ పంప గలిగారు.

మరొక ముఖ్య నాయకుడు ధారాసింగ్ కు కూడా జిల్లా అధ్యక్ష పదవిని ఇప్పించేందుకు ఎమ్మెల్యే చొరవ తీసుకోవడంతో అటు పార్టీ వర్గాలలో ఇటు గిరిజనుల్లో కూడా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మంచి స్థానం సంపాదించుకోగలిగారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కి ప్రధాన అనుచరుడుగా ఉన్న రవి గౌడ్కు డిసిసిబి జిల్లా ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించి ఎమ్మెల్యే ఆ వర్గాన్ని కూడా పూర్తిస్థాయిలో సంతృప్తి పరచగలగాడని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులలో సీనియర్ నాయకులు ముదిరాజ్ వర్గానికి చెందిన ఉత్తంచంద్ కు, మొస్లీం మైనార్టీ నుంచి అబ్దుల్ రావుఫ్ పేరును ప్రతిపాదించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీకే సిద్ధమైన సీనియర్ నాయకులకు కూడా పార్టీ పదవులు లేదా కో ఆప్షన్ పదవులు ఇస్తామని హామీ ఇవ్వడం ద్వారా మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎలాంటి అంతర్గత విభేదాలు లేకుండా ఎమ్మెల్యే చేయగలిగేనారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా పార్టీతో పాటు తన గెలుపుకు కృషి చేసిన వారికి కూడా ప్రత్యేక స్థానం కల్పించాలని భావించినట్లు తెలుస్తున్నది. మునిసిపల్ ఎన్నికల్లో గెలుపుతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు కచ్చితంగా తాండూర్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి ఎక్కువ సీట్లు తెప్పిస్తాయి అన్న ఆశాభావంతో పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నిన మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ కాంగ్రెస్ పార్టీ కే దక్కుతుందని తప్పకుండా మున్సిపల్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామన్న ధీమాతో కాంగ్రెస్ నేతలున్నట్లు తెలుస్తున్నది.

ఇదికూడా చదవండి…
కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ప్రచారం

