వేసవి నీటి ఎద్దడిపై ప్రత్యేక దృష్టి
– పట్టణ సుందరీకరణకు ప్రాధాన్యం
– వాహనాల స్క్రాప్‌కు బహిరంగ వేళం
– హైడ్రాలిక్ క్రేన్ కొనుగోలుకు ప్రతిపాదనలు
– ఆర్థిక వ్యవస్థ బలోపేతంకు పన్నులు చెల్లించాలి
– మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రస్తుత వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టిసారించడం జరుగుతుందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు.

సోమవారం మున్సిపల్ కార్యాలయంలో మొదటి కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కమీషనర్ మధుసూధన్ రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా మొత్తం 13 అంశాలకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా తాండూరు పట్టణ సుందరీకరణ కోసం స్వచ్ఛ భారత్ మిషన్ ( అర్బన్ )2.0 కింద ప్రణాళికలు సిద్దం చేయడం జరిగిందని తెలిపారు.

వాల్ పెయింటింగ్, అవగాహన కార్యక్రమాలు వంటి పనులు చేపట్టడానికి గాను రూ. 8 లక్షల70,585 లను కేటాయించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా వేసవి కాలంలో నీటి ఎద్దడి నివారించేందుకు 11 పనుల కింద రూ 55 లక్షలను కేటాయించడం జరిగిందని వెల్లడించారు. జెసిబి మరమ్మత్తులు మరియు విడిభాగాల సేకరణ కోసం రూ. 4 లక్షల 86 వేలు, రూ. 55లక్షలతో హైడ్రాలిక్ క్రేన్ కోసం ఎజెండాలో అంశాలను ప్రస్తావించడం జరిగిందని వివరించారు. దీంతో పాటు ఇతర పనుల కోసం చెల్లింపులు చేసేందుకు కౌన్సిల్ తీర్మానించడం జరిగిందని చెప్పారు. మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య నిర్వహణ వాహనాలను, ఇతర సామాగ్రిని బహిరంగ వేలం నిర్వహించేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపారని చెప్పారు. తాండూరు మున్సిపల్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం పట్టణ ప్రజలు పన్నులు చెల్లింపుకు సహకరించాలని కోరారు.



