వార్డు అభివృద్ధికి నిధులు కేటాయించండి..!
– ఎస్సీ, ఎస్టీల నిధుల కేటాయింపు చేపట్టాలి
– స్మశాన వాటిక పురోగతి, డ్రైన్ల నిర్మాణంకు పూనుకోవాలి
– మున్సిపల్ తొలి కౌన్సిల్‌లో జుంటుపల్లి వెంకట్ గళం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని సీతారాంపేట్ వార్డు అభివృద్ధికి నిధులు కేటాయించాలని 19వ వార్డు కౌన్సిలర్ జుంటుపల్లి వెంకట్ కోరారు.

సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మొదటి కౌన్సిల్ సమావేశం జరిగింది. మొదటి సారి కౌన్సిల్‌లో అడుగు పెట్టిన 19వ వార్డు కౌన్సిలర్ జుంటుపల్లి వెంకట్ తన వార్డు సమస్యలపై గళమెత్తారు. చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సమావేశం దృష్టికి తీసుకవచ్చారు. వార్డులోని సీతారాంపేట్, విశ్వంబర కాలనీ, సాయినగర్, బృందావన్ కాలనీ, చెన్మిళ్ల గార్డెన్, ఆల్ కరీం కాలనీలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను వివరించారు.

ఆయా కాలనీలలో డ్రైన్లు నిర్మాణం చేపట్టాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేపట్టాలని కోరారు. ముఖ్యంగా వార్డులోని స్మశాన వాటికలో బోర్లు, హైమస్టు లైట్లు ఏర్పాటు చేసి పురోగతికి చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూట్ ట్రైబ్స్ యాక్టు-2017 ప్రకారం ఎస్సీ, ఎస్టీ నిధులను కేటాయించేలా చూడాలని కోరారు. విశ్వంబర, బృందావన కాలనీలో పార్కులను అభివృద్ధి చేయాలని, చెన్‌గెష్‌పూర్ ఈద్గాకు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలన్నారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాను విస్తరించి.. విగ్రహం పునఃనిర్మాణం చేయాలని కోరారు. ఈ సమస్యలపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, కమీషనర్ మధుసూదన్ రెడ్డిలు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.



