సర్కారు వైఫల్యంతోనే విద్యార్థులపై ఫీజుల భారం

తాండూరు రాజకీయం వికారాబాద్

సర్కారు వైఫల్యంతోనే విద్యార్థులపై ఫీజుల భారం
– ఫీజుల వసూలపై హైకోర్టు తీర్పు ఆందోళనకరం
– ప్రభుత్వం బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలి
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుపై భారం మోపేలా వ్యవహరించడం వైఫల్యాన్ని మూటగట్టుకుంటుందని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు.

శనివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాలేజీలలో చదువుకుంటున్న విద్యార్థుల నుంచి యజమాన్యాలు ఫీజులు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల విచారం వ్యక్తం చేశారు. విద్యార్థుల నుండి తాత్కాలికంగా ఫీజులు వసూలు చేసుకునే అనుమతి ఇవ్వడం అత్యంత ఆందోళనకర పరిణామమని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆవేధన వ్యక్తం చేశారు. ప్రైవేట్ కళాశాలలకు ప్రభుత్వం చెల్లించవలసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు భారీగా పెండింగ్‌లో ఉండడంతో విద్యావ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని తెలిపారు.

ఈ నేపథ్యంలో జస్టిస్ శ్రీదేవి గారు కళాశాలలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌, మైనారిటీ విద్యార్థుల నుండి తాత్కాలికంగా ఫీజులు వసూలు చేసుకునే అనుమతి ఇవ్వడం ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైందని విమర్శించారు. దీని వల్ల పేద వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఫీజులు కట్టలేక చదువును మధ్యలోనే ఆపే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో ప్రైవేట్ కళాశాల యాజమాన్యం ఆర్థికంగా దెబ్బతిటున్నాయి అని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని అన్నారు. భవిష్యత్తులో ఫీజు చెల్లింపులకు స్పష్టమైన టైమ్‌బౌండ్ షెడ్యూల్ ప్రకటించాలని, విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా చర్యలు తీసుకోవాలని రాజ్ కుమార్ డిమాండ్ చేశారు.

మీ సేవలకు బ్రేక్..!