యువత భవితకు బీఎంఆర్ భరోసా!
– ఉచిత శిక్షణతో పోలీస్ కొలువుల వైపు అడుగులు
– కోచింగ్‌తోపాటు స్టడీ మెటీరియల్ ఉచితం
– పేదింటి బిడ్డలకు కొత్త ఆశలు
– గతంలో రెండు మెగా జాబ్‌మేళాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఉద్యోగం సాధించాలనే పట్టుదల ఉన్నా.. ఆర్థిక ఇబ్బందులతో కోచింగ్ తీసుకోలేక వెనుకబడుతున్న నిరుద్యోగ యువతకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి.

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే వారికి శిక్షణ అందించడంపై దృష్టి సారిస్తున్నారు. పేదింటి బిడ్డల కలల రెక్కలకు ఊతం అందిస్తూ ముందుకు సాగుతున్నారు.
పోలీస్ కొలువులకు ఉచిత కోచింగ్
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం బీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.

గత నెల రోజులుగా కొనసాగుతున్న ఈ తరగతులకు మంచి స్పందన లభిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో శిక్షణ అందించడంతోపాటు స్టడీ మెటీరియల్‌ను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
యువతకు అవకాశాలే లక్ష్యం
ఒకవైపు మెగా జాబ్‌మేళాల ద్వారా ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడం, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ అందించడం ద్వారా నిరుద్యోగ యువతకు తోడ్పాటు అందించే ప్రయత్నం జరుగుతోంది.

ఆర్థిక పరిస్థితులు లక్ష్యసాధనకు అడ్డంకిగా మారకుండా యువతకు అవసరమైన అవకాశాలు అందుబాటులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. శిక్షణను సద్వినియోగం చేసుకుని పట్టుదలతో సాధన చేస్తే ఉద్యోగ లక్ష్యాన్ని చేరుకోవచ్చనే ఆశ అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది.
గతంలో మెగా జాబ్‌మేళాలు
నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో గతంలో రెండుసార్లు మెగా జాబ్‌మేళాలు నిర్వహించారు.

100కు పైగా కార్పొరేట్ కంపెనీలను భాగస్వామ్యం చేసి ఉద్యోగార్థులకు అవకాశాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమాల ద్వారా యువతకు ఉద్యోగాల కోసం ప్రయత్నించే వేదిక లభించింది.
‘మాలాంటి పేద విద్యార్థులకు ఎంతో మేలు’ – రజిని, బషీరాబాద్

“మాది వ్యవసాయ కుటుంబం. చదువుకోవాలనే కోరిక ఉన్నా ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవు. పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలంటే కోచింగ్ ఖర్చులు భరించడం కష్టంగా ఉండేది. ఇలాంటి సమయంలో ఉచిత శిక్షణ అందుబాటులోకి రావడం మాలాంటి పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించాలనుకుంటున్నాను” అని రజిని పేర్కొన్నారు.
లక్ష వరకు ఖర్చయ్యేది – శ్రీశైలం, అల్లాపూర్

“హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకోవాలంటే ఫీజులు, హాస్టల్, స్టడీ మెటీరియల్, ఇతర ఖర్చులు కలిపి దాదాపు లక్ష రూపాయల వరకు ఖర్చయ్యే పరిస్థితి ఉంటుంది. అదే శిక్షణను మన తాండూరులోనే ఉచితంగా పొందడం సంతోషంగా ఉంది. ఆర్థిక భారం లేకుండా పరీక్షలకు సిద్ధమయ్యే అవకాశం రావడం మాలాంటి నిరుద్యోగ యువతకు ఎంతో తోడ్పాటునిస్తోంది” అని శ్రీశైలం తెలిపారు.


