పండగ పూట తాగునీటి తిప్పలు
– నాలుగు రోజులుగా సరఫరా బంద్
– పట్టించుకొని పాలకులు, అధికారులు
– బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్ధుల్ సలీం
తాండూరు, దర్శిని ప్రతినిధి: పండగ పూటా తాగునీటి తిప్పలు తప్పడం లేదు.. నాలుగు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయినా పట్టించుకునే నాథుడే కరువయ్యారాని బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు నీటి కోసం అవస్థలు పడుతున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై మండిపడ్డారు.

తాగునీటి సరఫరా నాలుగు రోజులుగా నిలిచిపోయిందని, దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అబ్దుల్ సలీం పేర్కొన్నారు. పండగ వేళ ప్రజలకు నీటి అవసరం మరింత పెరుగుతుందని తెలిసినా సరఫరాను పునరుద్ధరించడంలో అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. సాంకేతిక సమస్యలు లేదా ఇతర కారణాలతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయ మార్గాల్లో నీటిని అందించాల్సిన బాధ్యత అధికారులపై లేదా? అని నిలదీశారు.

ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి తక్షణమే స్పందించాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పండగ పూట కూడా తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి రావడం పాలనా వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు.

తాగునీటి సమస్యకే పరిమితం కాకుండా పట్టణంలో వీధి దీపాలు, పారిశుధ్య నిర్వహణలోనూ అలసత్వం కనిపిస్తోందని అబ్దుల్ సలీం ఆరోపించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉన్నా, సమస్యలు పరిష్కారం కాకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రజల అవసరాలను పట్టించుకోకుండా పాలకులు, అధికారులు వ్యవహరిస్తే సామాన్యులు ఎవరికి తమ సమస్యలు చెప్పుకోవాలని ప్రశ్నించారు.

తాండూరు పట్టణంలో తాగునీటి సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని, అప్పటివరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ప్రజలకు నీటిని అందించాలని అబ్దుల్ సలీం డిమాండ్ చేశారు. వీధి దీపాలు, పారిశుధ్య సమస్యలను కూడా వెంటనే పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతారా? లేక ప్రజల నీటి కష్టాలు ఇలాగే కొనసాగుతాయా? అన్నది వేచి చూడాల్సిందే.


