పేకాట రాయుళ్లకు ఝలక్
– 13మందిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
– వికారాబాద్ జిల్లాలో కోట్‌పల్లిలో ఘటన
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : పండగ పూట పేకాట ఆడుతున్న పేకాట రాయుళ్లకు వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఝలక్ ఇచ్చారు. ఓ గదిలో గుట్టుకున్న పేకాట ఆడుతున్న 13 మందిని పట్టుకున్నారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఆదివారం వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ వేంకటేశం తన సిబ్బందితో కలిసి కోట్‌పల్లిలో దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు గ్రామంలోని ఓ రూములో పేకాట ఆడుతున్నట్లు గుర్తించి మూకుమ్మడి దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 13 సెల్ ఫోన్లు, 4 బైక్ లు రూ. 77 వేలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని కోట్‌పల్లి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు కోట్‌పల్లి పోలీసులు తెలిపారు.

