మార్కెట్లోకి కరోనా మందు..!
– కోవిషీల్డ్, కోవాగ్జీన్ అమ్మకాలకు ప్రయత్నాలు
– భారీగా తగ్గనున్నవ్యాక్సీన్ ధరలు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కేసుల ఉధృతికి జనాలు బెంబేలెత్తున్న తరుణంలో గుడ్‌న్యూస్‌ను చెప్పింది ఎపీపీఏ సంస్థ. కోవిషీల్డ్(Covishield), కోవాగ్జిన్(Covaxin) టీకాల కంపెనీలు, రెగ్యులర్ మార్కెట్లోకి వచ్చేందుకు అప్రూవల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. దీంతో కరోనా నియంత్రణలో మరో ముందగుడు పడనుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అయితే దీనిపై కొన్ని షరతులకు లోబడి ఉపయోగించడానికి కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్‌లకు సాధారణ మార్కెట్లోకి పర్మిషన్ ఇవ్వాలని కోవిడ్-19 సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ సిఫార్సు చేసింది. ప్రస్తుతం ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో కోవాగ్జిన్ ధర ఒక డోస్‌కు 1200 రూపాయలుగా ఉండగా, కోవిషీల్డ్ ధర 780గా ఉంది. వీటికి అదనంగా 150 రూపాయలు సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ రెండు కూడా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉపయోగించేందుకు అనుమతులు ఉన్న వ్యాక్సిన్‌లే. అయితే, ఒకవేళ వ్యాక్సిన్‌కు మార్కెట్ ఆథరైజేషన్ లేబుల్ దక్కితే కేవలం అత్యవసర పరిస్థితులు, రిజర్వ్‌డ్ కండిషన్స్‌లో మాత్రమే విక్రయించాలనే నిబంధన ఉండదు. అనుకున్నట్లుగా రెగ్యులర్ మార్కెట్‌లోకి ఈ టీకాలు వస్తే, వ్యాక్సిన్ తీసుకునే వారి సంఖ్య ఇంకా పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. మరోవైపు రెగ్యులర్ మార్కెట్‌లోకి వచ్చిన వెంటనే ఈ రెండు కొవిడ్ వ్యాక్సిన్‌ల ధరలు భారీగా తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు వ్యాక్సిన్‌ల ధరలు ఒక్కో డోసు 275 రూపాయలుగా నిర్ధారణ కానున్నట్టు తెలుస్తోంది. అదనంగా సర్వీస్ ఛార్జీ మరో 150 రూపాయలతో మొత్తంగా 425 రూపాయలు ఉండొచ్చనే వార్తలు వస్తున్నాయి

