ఆరోగ్య తెలంగాణలో ఆశ వర్కర్ల సేవలు కీలకం
– రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి
– ఆశ వర్కర్లకు స్మార్ట్ ఫోన్‌లు అందించిన మంత్రి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ సర్కారు ఆశ వర్కర్లు అందించిన సేవలు కీలకంగా నిలుస్తాయని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్‌లో మంత్రి సబితారెడ్డి వికారాబాద్ ఎమ్మెల్యే డా. మెతుకు ఆనంద్, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, చేవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, కోడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె.నిఖలతో కలిసి ఆశ వర్కర్లకు ప్రభుత్వం అందించిన స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కృషిచేస్తున్నారని అన్నారు. కోవిడ్ సమయంలో దాని నియంత్రణకు ఆశ వర్కర్లు సమర్థవంతంగా వైద్య శాఖ కు తోడుగా ఆశ కార్యకర్తలు నిలబడి సహకారం అందించటం గొప్ప విషయం అన్నారు. ఆరోగ్య తెలంగాణలో భాగంగా దేశానికి ఆదర్శంగా చేపట్టిన ఫీవర్ సర్వేలో ప్రాణాలను ఫణంగా పెట్టి ఆశ వర్కర్లు చేసిన సేవలు కీలకమైనవి అన్నారు. ఆశ వర్కర్ల సేవలను గుర్తించి సీఎం కేసీఆర్ వారి వేతనాలను రూ. 3వేల నుంచి 9 వేలకు పెంచారని అన్నారు. దీంతో పాటు కష్టపడి పనిచేసిన ఆశ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్ లు అందిస్తున్నారని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆశ కార్యకర్తలు మరింత బాధ్యతగా మెరుగైన సేవలను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

