గత కౌన్సిల్ ఎజెండాపై స్టేను వెనక్కి తీసుకోవాలి
– మున్సిపల్ వద్ద ప్రతిపక్ష కౌన్సిలర్ల నిరసన
తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ అభివృద్ధి కోసం గత కౌన్సిల్‌లో ప్రవేశ పెట్టిన ఎజెండాపై కోర్టుకు వెళ్లిన చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ స్టేను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్, బీజేపీ, టీజేఎస్, సీ సీపీఎం ప్రతిపక్ష కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తాండూరు మున్సిపల్ 2022-23 సంవత్సరం బడ్జెట్ సమావేశానికి హాజరుకాకుండా బహిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్. టీజేఎస్ ఫ్లోర్ లీడర్ సోమ శేఖర్, స్టీపీఎం ఫ్లోర్ లీడర్ ఆసీఫ్, బీజేపీ కౌన్సిలర్ అంతారం లలిత తదితరులు మాట్లాడుతూ మున్సిపల్ చైర్ పర్సన్ సొంత ప్రయోజనాల కోసం బడ్జెట్ సమావేశాన్ని పెట్టుకున్నారని ఆరోపించారు. రూ.9 కోట్లతో ప్రవేశ పెట్టిన గత కౌన్సిల్ ఎజెండాపై చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని గుర్తు చేశారు. తనకు కావాల్సిన విధంగా ఎజెండా రూపొందించాలని పట్టుబడుతున్నారని అన్నారు. ఇలాంటి వ్యవహారాలతో తాండూరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ కోర్టుకు వెళ్లిన ఎజెండా పై వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు. తాండూరు అభివృద్ధిపై చిత్త శుద్ధి ఉంటే కోర్టులో వేసిన స్టేను వాపసు తీసుకోవాలన్నారు. నేను వాపసు తీసుకుంటే బడ్జెట్కు ఆమోదం తెలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు మమత, మధుబాల తదితరులు ఉన్నారు.

