డ్రగ్స్‌పై దండయాత్ర..!
– మత్తు రహిత తాండూరు లక్ష్యం
– చైతన్యవంతంగా పట్టణంలో 2కే రన్
– పాల్గొన్న చైర్ పర్సన్ నీరజా బాల్‌రెడ్డి, నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : డ్రగ్స్ మహమ్మారి అంతమే లక్ష్యమంటూ తాండూరులో దండయాత్ర చేపట్టారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం తాండూరులో సే నో టు డ్రగ్ అనే నినాదంతో యాంటి డ్రగ్ ర్యాలీతో పాటు 2కే రన్ కార్యక్రమం చేపట్టారు.

పట్టణంలోని శివాజీ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగిన ర్యాలీని మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి హాజరై ప్రారంభించారు. ర్యాలీలో తాండూరు నేతలు, మున్సిపల్ కౌన్సిలర్లు, యువకులు పాల్గొన్నారు. డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చేపట్టిన ర్యాలీ చైతన్య వంతంగా కొనసాగింది. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ డ్రగ్స్ వాడకం వల్ల జీవితాలు నాశనమవుతాయని అన్నారు.

ఈ సంస్కృతి సమాజ భద్రతను దెబ్బతీస్తుందని అన్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణ మాదిరి.. మత్తు రహిత తాండూరే అందరి లక్ష్యమని అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల వైపు ఆసక్తి చూపించాలన్నారు. కలకలరం రేపిన డ్రగ్స్ ఘటనలో తాండూరు నేతలు ఉండడం తలదించుకునేలా మారడం విచారకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మర్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ళ నర్సింలు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, సిబ్బంది, పలు వార్డుల కౌన్సిలర్లు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, ప్రముఖులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.


