తెరపైకి ఒప్పంద రాజకీయాలు..!
– చర్చనీయాంశంగా బల్దియా చైర్ పర్సన్ పీఠం
– తగ్గేదేలే.. వదిలేదేలే.. రంజుగా మారుతున్న వ్యవహారం
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలోని తాండూరులో ఒప్పంద రాజకీయాలు వేడిపుట్టిస్తున్నాయి. తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పీఠం లక్ష్యంగా వ్యూహ ప్రతి వ్యూహాలు రంజు రంగును అలుముకుంటున్నాయి. స్థానికంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గీయులు చైర్ పర్సన్ పదవిపై తగ్గేదేలే.. వదిలేదేలే.. అనే సంకేతాలను ఇస్తున్నాయి. టీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్ మద్య కొనసాగుతున్న పోరులో సందులు సడేమియా లాగా ప్రతిపక్షానికి చెందిన కాంగ్రెస్, టీజేఎస్, సీపీఎంతో పాటు బీజేపీలోని కొందరు కౌన్సిలర్లు ఇందుకు పరోక్షంగా మద్దతు ఇచ్చేందుకు సిద్దమైనట్లు సమాచారం. గత రెండేళ్ల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి 17 మంది, కాంగ్రెస్ నుంచి 4, బీజేపీ నుంచి 7, ఎంఐఎం నుంచి 3, టీజేఎస్ నుంచి 1, సీపీఎం నుంచి 1, స్వతంత్రులుగా ముగ్గురు ఎన్నికయ్యారు. ఎన్నికల అనంతరం స్వతంత్ర అభ్యర్థులు టీఆర్ఎస్లో చేరారు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ చైర్ పర్సన్ అభ్యర్థిగా మొదట విజయదేవిని అనుకున్నారు. కాని అనూహ్యంగా టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు తాటికొండ స్వప్న పరిమళ్ గుప్త తెరపైకి వచ్చారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత చైర్ పర్సన్ పదవి కోసం టీఆర్ఎస్ పార్టీ తరుపున సాయిపూర్ నుంచి పోటీ చేసిన పట్లోళ్ల దీపా నర్సింలు, స్వప్న పరిమళ్ మద్య తీవ్ర పోటీ నెలకొనడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే అప్పట్లో పార్టీ సీనీయర్ నాయకులు, మంత్రుల సమక్షంలో చైర్ పర్సన్ పదవిపై చెరో రెండున్నర ఏళ్లు పంచుకోవాలనే ఒప్పందం చేసినట్లు అదే సమయంలో వార్తలు వినిపించాయి. తాజాగా ఒప్పంద గడువు సమీపిస్తుందని ఒప్పంద రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ఐదేళ్ల పాటు కొనసాగుతారని చేసిన వాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మరోవైపు శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన బడ్జెట్ సమావేశంపై నిరసన వ్యక్తం చేసిన ప్రతిపక్షానికి చెందిన ఓ కౌన్సిలర్ కూడ చైర్ పర్సన్ పీఠం ఒప్పందాన్ని గుర్తుచేశారు. ఓ వైపు ఐదేళ్లు వదిలేదిలే.. ఓ వర్గం అంటుండగా.. మరోవైపు పీఠాన్నీ చేజిక్కునేంత వరకు తగ్గేదేలే.. అంటూ మరో వర్గం వ్యవహారం కొనసాగుతోంది. రానున్న రాజుల్లో ఈ రాజకీయ ఒప్పంద వ్యహారం ఎక్కడికి దారితీస్తుందోనని రాజకీయ విశ్లేశకులు, నాయకులతో పాటు పట్టణ వాసుల్లో ఆసక్తి నెలకొంది.

