ధాన్యం కొనుగోళ్ల‌పై క‌స‌ర‌త్తు షురూ..!

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

ధాన్యం కొనుగోళ్ల‌పై క‌స‌ర‌త్తు షురూ..!
– జిల్లాలో 167 యాసంగి కొనుగోలు కేంద్రాలు
– ఈనెల 25 నుంచి కోనుగోళ్లు ప్రారంభం
– మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ఆదేశాలు
వికారాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ‌లో యాసంగి ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేస్తామ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించి రైతుల‌కు ఊర‌ట క‌ల్పించారు. సీఎం ప్ర‌క‌ట‌న త‌రువాత రాష్ట్ర మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌, పౌర స‌ర‌ఫ‌రాల శాఖ అధికారులు కొనుగోలు కేంద్రా ఏర్పాటుకు క‌స‌ర‌త్తును ప్రారంభించారు. ఈ మేరకు బుధ‌వారం పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ఆ శాఖ అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మావేశం నిర్వ‌హించారు. వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా ఆయా శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని మంత్రి గంగుల‌ కమలాకర్ సూచించారు. కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు.కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించాలని, గన్నిబ్యాగులు ,తేమ యంత్రాలు ప్యాడి క్లీనర్లు, తూకం యంత్రాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. అవసరమైన గన్నీ బ్యాగులను రైస్ మిల్లర్ల వద్ద నుండి వెంటనే సేకరించుకొవాలని సూచించారు. గన్ని బ్యాగులు ఎట్టిపరిస్థితుల్లోనూ కొనుగోలు కేంద్రం దాటిపోవద్దని స్పష్టం చేశారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక్కో బాధ్యత గల అధికారిని నియమించాలన్నారు. ఏలాంటి పొరపాట్లు జరిగిన సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పొరుగు రాష్ట్రాల నుండి అక్రమంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నందున గట్టి నిఘా పెట్టాలని సూచించారు. ఈ మేర‌కు జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల‌పై ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్ తెలిపారు. ఈ నెల 25 నుండి జిల్లాలో 167 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్ల‌డించారు. ప్రస్తుతం జిల్లాలో 7.36 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచ‌డం జ‌రిగింద‌న్నారు. దాదాపు 1.14 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంద‌ని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, డిఆర్డిఓ కృష్ణన్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.