ప్రతి పరీక్షా కేంద్రానికి జీపీఎస్..!
– అరగంట ముందు కేంద్రానికి చేరుకోవాలి
– పరీక్షా కేంద్రాలపై నిఘా, అన్ని సౌకర్యాలు
– అమలులో నిమిషం నిబంధన
– కస్టోడీయన్లు మల్లినాథ్, కృష్ణయ్య
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్దం చేయడం జరిగిందని కస్టోడియన్లు మల్లినాథప్ప, కృష్ణయ్యలు తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని మొత్తం 9 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇందులో ప్రభుత్వ జూనియర్ కళాశాల, చైతన్య జూనియర్ కళాశాల, సిందు కళాశాల, సిద్దార్థ కళాశాల, భాష్యం కళాశాల, అంబేద్కర్ కళాశాలతో పాటు హైదరాబాద్ రోడ్డు మార్గంలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల, తెలంగాణ మైనార్టీ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 2800 మంది, రెండో సంవత్సరంలో 2500 మంది విద్యార్థులు పరీక్షలను రాస్తున్నారని, ఇందులో ఒకేషనల్‌కు సంబంధించి మొదటి సంవత్సరంలో 700ల మంది, రెండో సంవత్సరంలో దాదాపు 600ల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని చెప్పారు. విద్యార్థులు అరగంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. నిమిషం ఆలస్యమైన అనుమతి లేదు అనే నిబంధన అమల్లో ఉంటుందన్నారు. దూర ప్రాంతాలలోని పరీక్షా కేంద్రం విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. అదేవిధంగా ఈ సారి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి పరీక్షా కేంద్రానికి ఇంటర్ బోర్డు జీపీఎస్ విధానాన్ని అమల్లోకి తెచ్చిందని పేర్కొన్నారు. దీని సహాకారంతో విద్యార్థులు పరీక్ష కేంద్రం నెంబర్‌ను ఎంటర్ చేస్తే వారికి నేరుగా పరీక్షా కేంద్రానికి మార్గం చూపిస్తుందన్నారు. మరోవైపు పరీక్షా కేంద్రాల 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పోలీసు, ఎఎన్ఎం సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. విద్యార్థులకు తాగునీటి, మరుగుదొడ్ల వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. పరీక్షా ముగిసే అరగంట ముందు విద్యార్థులకు బయటకు అనుమతించడం జరగదని స్పష్టం చేశారు.

