కోరిన పుస్తకాన్ని అందించడమే లక్ష్యం
– ఆన్ డిమాండ్ బుక్స్ కు విశేష స్పందన
– జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: విద్యార్థులకు, నిరుద్యోగులకు కోరిన పుస్తకాలను అందించడమే లక్ష్యమని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఆన్ డిమాండ్ బుక్స్ తొలి కార్యక్రమం వికారాబాద్ జిల్లా కేంద్రంగా ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ జిల్లా కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆన్ డిమాండ్ బుక్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఆన్ డిమాండ్ బుక్స్ ద్వారా విద్యార్థులు కోరిన పుస్తకాలను బ్రాంచ్ గ్రంథాలయాలకు అందించడం జరిగిందని తెలిపారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ నిర్వహకులకు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్ డిమాండ్ విధానంతో గ్రంథాలయాలకు పూర్వవైభవం వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్న నోటిఫికేషన్లో భాగంగా నిరుద్యోగులు అందరూ గ్రంథాలయాలను ఆదరిస్తున్నారు. విద్యార్థులకు కావలసిన పుస్తకాలను గ్రంథాలయాల్లో అందుబాటులో ఉన్నాయని, ఆన్ డిమాండ్ బుక్స్ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ఏ పుస్తకాన్ని కోరినా వారికి అందించడం జరుగుతుందని అన్నారు. రానున్న రోజుల్లో విద్యార్థులకు ఎలాంటి పుస్తకాలు కావలసి వచ్చినా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ కేంద్రంలో దాదాపు 150 స్టడీ చైర్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఏక కాలంలో (500) ఐదు వందల మంది విద్యార్థులకు పైగా చదువుకునే అవకాశం కల్పించి, విద్యార్థులకు చల్లని త్రాగునీరు కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో గ్రంథాలయంలో విద్యార్థులు మెంబర్షిప్ ను తీసుకుంటే వారికి కావలసిన పుస్తకాలను అందిస్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ నాగేందర్ గౌడ్, శాఖ గ్రంథాలయ పాలకులు కిషన్ తదితరులు పాల్గొన్నారు.
పూర్తిగా కింది వరకు చూడండి…


