పట్టణ ప్రగతి మెరవాలి
– వైకుంఠదామం పురోగతిపై దృష్టి
– వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటుకు చర్యలు
– వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖిల
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతిలో మెరుగైన వసతులు కల్పించేలా దృష్టిసారించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖిల అన్నారు. పట్టణ ప్రగతి నాలుగో విడతలో భాగంగా బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖిల తాండూరు పట్టణాన్ని సందర్శించారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, తాండూరు ఆర్డీఓ, ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్‌తో కలిసి వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని సందర్శించి వసతుల కల్పనపై ఆరా తీశారు. అదేవిధంగా పట్టణంలోని రైతు బజార్‌లో సమీకృత మార్కెట్ స్థలాన్ని సందర్శించి వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటుపై సమీక్షించారు.
అంతేకాకుండా పోలీస్టేషన్ వెనుకాల ఉన్న బీసీ స్మశాన వాటిక వద్దకు చేరుకుని వైకుంఠదామం ఏర్పాటుపై అడిగి తెలుసుకున్నారు. వైకుంఠ దామానికి గతంలోనే నిధులు మంజూరయ్యాయనే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తేవడంతో వెంటనే నిర్మాణాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులు, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్‌లతో మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతిలో ప్రణాళిక బద్దంగా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. మెరుగైన వసతులు, అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రగతి ప్రత్యేకాధికారి వినయ్ కుమార్, కౌన్సిలర్ మమత, మున్సిపల్ ఏఈ ఖాజా, టీపీఎస్ జీషాన్, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.


