అదుపు తప్పి షెడ్డులోకి
– దూసుకెళ్లిన కారు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పగటి వేళ ఓ కారు అదుపు తప్పింది. దూసుకెళుతూ రిపేరులో ఉన్న షెడ్డును ఢీకొట్టింది. అదృష్ట వశాత్తు అక్కడ ఎవ్వరు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం వాటిళ్లలేదు. ఈ సంఘటన ఆదివారం తాండూరు పట్టణ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మధ్యాహ్న సమయంలో గౌతాపూర్ రోడ్డు వైపు నుంచి తాండూరు పట్టణంలోకి టీఎస్34 బీ 1116 నెంబర్ గల కారు వస్తుంది. అప్పటి వరకు అదుపులోనే ఉన్న వాహనం సెయింట్ మార్క్స్ స్కూల్ సమీపంలోకి రాగానే డ్రైవర్ చేతి నుంచి అదుపు తప్పింది. వెంటనే రోడ్డు పక్కనే ఉన్న రిపేరు షెడ్డులోకి దూసుకెళ్లింది. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో స్థానికులు గుమిగూడారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని షెడ్డులోకి దూసుకెళ్లిన కారును తొలగించారు. ట్రాఫిక్‌కు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నారు. అయితే ప్రమాదానికి కారణమైన కారు ఓ రాజకీయ నాయకుడుకు చెందినదిగా తెలిసింది.


