మునుగోడు గెలుపు మలుపులో..!

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

మునుగోడు గెలుపు మలుపులో..!
– కలిసొచ్చిన ఎమ్మెల్యే పైలెట్ రో’హిట్‌’ రెడ్డి ఫార్మూలా
– కీలకమైన ఎమ్మెల్యే కొనుగోలు ఎర వ్యవహారం
– చండూరులో ప్రచారంలో కూడ లీడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: మునుగోడు ఉప ఎన్నికలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయనంలో అతిశయోక్తి లేదు. ఉప పోరులో గెలుపు కోసం అధికార టీఆర్ఎస్, బీజేపీల మద్య జరిగిన ఎత్తుల పైఎత్తులు దేశ రాజకీయాలలో చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా కేంద్రం నుంచి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరం జాతీయ రాజకీయాలలో కలకలం సృష్టించాయి. ఇవే మునుగోడు ఉప పోరులో అభ్యర్థుల గెలుపు, ఓటములను మలుపు తిప్పాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పెను సంచలనంలో పైలెట్ రోహిత్ రెడ్డి హిట్‌ ఫార్మూలా టీఆర్ఎస్‌ గెలుపుకు మలుపు తిప్పాయని అధికార టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారు.

కొన్ని నెలలకు ముందు మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరి పదవికి రాజీనామా చేయడం. తరువాత ఉప ఎన్నికలు రావడం రాష్ట్ర రాజకీయాలలో ఉత్కంఠత రేపింది. 2018 ఎన్నికల్లో కోల్పోయిన ఈ స్థానాన్ని తిరిగి సొంతం చేసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ బరిలో నిలిచింది. 2014లో ఇక్కడ గెలుపొందిన కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డినే అభ్యర్థిగా రంగంలోకి దించింది. ప్రధాన ప్రత్యర్థి బీజేపీ ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణుల్ని భారీగా మోహరించింది. మండలానికో ఇన్‌ఛార్జిని నియమించింది. ఇందులో భాగంగా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చండూరు నియోజకవర్గంలోని పలు రెవెన్యూ గ్రామాలకు ఇంచార్జ్‌గా నియమించిన విషయం తెలిసిందే.

ఓ వైపు ప్రచారం జరుగుతుండగానే టీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు వ్యవహారం అకస్మాత్తుగా తెరపైకి రావడం సంచలనం సృష్టించాయి. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫౌంహౌస్‌లో జరిగిన సంఘనటలు వెలుగులోకి రావడం.. ఈ సంఘటన బహిర్గతం కావడం.. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రధాన పాత్ర ఉండడం మునుగోడు ఉప ఎన్నికలపై ప్రభావం చూపించాయని భావిస్తున్నారు. ఆ తరువాత వెలుగులోకి వచ్చిన ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాల వీడియో, ఆడియోలు సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభలో తెలంగాణ హీరోలు అంటూ ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డితో పాటు మిగతా ఎమ్మెల్యేలను అభివర్ణిస్తూనే కేంద్రంపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఇవి కూడ మునుగోడు గెలుపుకు కలిసొచ్చాయి.

మరోవైపు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇంచార్జ్‌గా ఉన్న గ్రామాలలో టీఆర్ఎస్‌కు మంచి లీడ్‌ కూడ వచ్చింది. చండూరులోని ఉడుతల పల్లి, కోటయ్య గూడెం తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి జోరుగా ప్రచారం చేశారు. పూర్తిగా గ్రామీణ ప్రజలు ఉండే ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అనుచరులతో కలిసి చేసిన ప్రచారం ఆకట్టుకుందని నేతలు అంటున్నారు. దీంతో ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో చండూరు మండలానికి సంబంధించి 8,9,10 రౌండ్లలో టీఆర్ఎస్‌కు లీడ్‌ వచ్చింది.