ఢిల్లీ న‌డిబొడ్డున తెలంగాణ భ‌వ‌న్

జాతీయం తెలంగాణ

ఢిల్లీ న‌డిబొడ్డున తెలంగాణ భ‌వ‌న్
– నేడు శంక‌స్థాప‌న చేయ‌నున్న సీఎం కేసీఆర్
– త‌ర‌లివెళ్లిన ముఖ్య నేత‌లు
ద‌ర్శ‌ని ప్ర‌తినిధి: దేశ రాజధాని ఢిల్లీలో సీఎం కేసీఆర్ తెలంగాణ భ‌వ‌న్ నూత‌న కార్యాల‌యానికి శంకుస్థాప‌న చేయ‌బోతున్నారు. దీంతో తెలంగాణ నాయ‌కులు, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కల సాకారం కాబోతోంది. ఇందుకు అనుగుణంగా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా చేసేలా ఏర్పాట్లు చేస్తోంది.

ఒక రాష్ర్టానికి చెందిన వ్యక్తికి దేశ రాజధాని ఢిల్లీ వెళ్లే అవసరం వస్తే.. ఉండే విధంగా అన్ని హంగులతో నిర్మాణాన్ని చేపడుతోంది టీఆర్ఎస్. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయమూ ఇదే. ఈ లక్ష్యంతోనే ఢిల్లీలో గురువారం తెలంగాణ భవన్‌ నిర్మాణాన్ని తలపెట్టారు.
తమకంటూ రాష్ట్రం కావాలని తెలంగాణ బిడ్డడు ఢిల్లీలో బలిదానం చేసుకుంటే, కనీసం అతడి మృతదేహాన్ని కూడా ఏపీ భవన్‌లోకి రానీయలేదు. తెలంగాణ సమాజం ఇటువంటి గాయాలనెన్నింటినో పంటి బిగువున అనుభవించింది. ఇప్పుడిక ఇతర ప్రాంతాల్లో మన వసతులు నిర్మించుకోవడమూ అవసరమే. ఈ క్రమంలోనే కేసీఆర్‌ ఢిల్లీలో తెలంగాణ భవన్‌ నిర్మాణం చేపట్టారు.

ఢిల్లీలోని వసంత్‌ విహార్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో టీఆర్‌ఎస్‌ కార్యాలయ నిర్మాణం చేపట్టనున్నారు. దక్షిణ భారతదేశంలో ఏ ప్రాంతీయపార్టీకి లేనివిధంగా టీఆర్‌ఎస్‌కు సొంత భవనం ఏర్పాటుకానున్నది. ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో 1,100 చదరపు మీటర్ల ప్రాంగణంలో నిర్మించనున్న తెలంగాణభవన్‌కు సరిగ్గా ఒంటిగంటా 48 నిమిషాలకు భూమిపూజ చేయనున్నారు సీఎం కేసీఆర్. రూ. 40 కోట్లతో అంచనా వ్యయంతో TRS భవన్‌ను నిర్మిస్తున్నారు. మీటింగ్‌ హాల్‌తో పాటు రాష్ట్రం నుంచి వివిధ పనుల మీద వచ్చే వారు స్టే చేసేందుకు అన్ని ఫెసిలిటీస్‌ ఉండేలా డిజైన్ చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ను పోలి ఉంటుందని అంటున్నాయి పార్టీ శ్రేణులు.

హస్తినలో పార్టీ కార్యాలయానికి భూమిపూజ కార్యక్రమాన్ని ఇంటి పండుగలా చేసుకొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం కుటుంబసమేతంగా ఢిల్లీ చేరుకున్నారు. అలాగే, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, పార్టీ కార్యవర్గ సభ్యులతోపాటు, ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థి నాయకులు ఢిల్లీ చేరుకున్నారు. తెలంగాణభవన్‌ భూమి పూజ సందర్భంగా ఢిల్లీ పురవీధులన్నీ గులాబీయం అయ్యాయి. ఢిల్లీకి చేరుకున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులకు లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు ఆతిథ్యం ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏ ప్రాంతీయ పార్టీకి ఢిల్లీలో ఆఫీసు లేదు. అలాంటిది టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా ఆఫీసును నిర్మించుకోవడంపై నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.