తెలంగాణ గ్రూప్-2 పరీక్షల డేట్ ఫిక్స్
– ప్రకటించిన టీఎస్పీఎస్సీ
– పరీక్షల తేదిలు ఎప్పుడంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో గ్రూప్-2 కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి ప్రభుత్వం అప్రమత్తమైన ప్రకటన చేసింది. గ్రూప్-2 పరీక్షల తేదీలను ఖరారు చేసినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించి 783 పోస్టులకు గానూ 5,51,943 దరఖాస్తులు వచ్చినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తెలిపింది. జనవరి 18నుంచి ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరించగా 5,51,943 మంది దరఖాస్తులు అందించారు. వీరికి వచ్చే ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షకు వారం రోజుల ముందు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. మరోవైపు తెలంగాణలో 783 పోస్టులకు గాను 5,51,943 దరఖాస్తులు లభించడంతో ఒక్కో పోస్టుకు 705 మంది పోటీ పడుతున్నారని అంచనా వేశారు. ఇతర పోటీ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పరీక్షా తేదీని నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు.
పోస్టులు వివరాలు ఇవే
ఇదిలా ఉంటే మొత్తం 783 ఖాళీలకుగాను.. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–3 – 11 పోస్టులు, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ – 59, డిప్యూటీ తహసీల్దార్ (నాయిబ్ తహసీల్దార్) – 98, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్–2 – 14 ఖాళీలు ఉన్నాయి.అసిస్టెంట్ రిజిస్ట్రార్ (కో–ఆపరేటివ్ సబ్ సర్వీసెస్) – 63, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ – 09, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (మండల పంచాయతీ అధికారి)-126, ఎక్సైజ్ సబ్ ఇన్ స్పెక్టర్ – 97 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు..అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్(హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్) – 38, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(జనరవ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్) – 165, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సెక్రటేరియట్ – 15 ఖాళీలు ఉన్నాయి.

