పారిశ్రామిక పార్కు రైతులకు భరోసా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పారిశ్రామిక పార్కు రైతులకు భరోసా..!
– అందరికి ఇంటిస్థలం, ఇందిరమ్మ ఇళ్లు
– అర్హత కలిగిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
– వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
– తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో చెక్కుల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కుకు భూములు ఇచ్చిన రైతులకు భరోసా ప్రకటించారు. భూములు అందించిన రైతులందరికి ఇంటి స్థలం లేదా ఇందిరమ్మ ఇంటిని ఇవ్వడం జరుగుతుందని, అదేవిధంగా కుటుంబంలో అర్హత కలిగిన వారికి ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. కోడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక పార్కుకు దుద్యాల మండలం, హకీంపేట్, లగచర్లకు చెందిన 25 మంది రైతులు వారికి చెందిన 31.08 ఎకరాల భూములు అందించారు.

వారికి ప్రభుత్వం ద్వారా రూ.6కోట్ల 20లక్షల పరిహారం మంజూరైంది. ఈ మేరకు శుక్రవారం తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో రైతులకు నష్టపరిహార చెక్కులను పంపిణీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ హాజరై జిల్లా అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ లతో కలిసి రూ.6కోట్ల 20 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామిక పార్కుకు సొంత భూములు అందించిన రైతులకు ఒకే విడతలో నష్టపరిహారం అందించడం జరుగుతుందని అన్నారు.

భూములు కోల్పోయిన రైతులకు 150 గజాల్లో ఇంటిస్థలం, కుటుంబంలో అర్హత కలిగిన వారికి ఓ ఉద్యోగం అందిస్తామన్నారు. లేదా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయిస్తామన్నారు. ఎకరం లోపు తక్కువ స్థలం ఉన్న రైతులకు 75 గజాల్లో ఇంటిస్థలం కేటాయించడం జరుగుతుందని స్పష్టం చేశారు. రైతులకు అందించిన నష్టపరిహారాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిషన్, అధికారులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

జుంటుపల్లి జాతరకు ఏర్పాట్లు చేయండి