ఇందిరమ్మ ఇళ్లు.. ఇంకెప్పుడో..!
– ఎదురు చూస్తున్న లబ్దిదారులు
– ఇంకా అందని ప్రోసిడింగ్లు
– తాండూరు పట్టణంలో గందరగోళం
– ఎమ్మెల్యే మనోహరన్నపై ఆశలు
– పట్టణంలో లబ్దిదారులు ఎంతమంది అంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టి అధికారంలోకి వచ్చాకా ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేస్తోంది. మొదటి విడతలో లబ్దిదారులను గుర్తించి ఇళ్ల నిర్మాణాల్లో దూకుడు పెంచింది. గ్రామాల్లో ప్రోసిడింగ్లు అందుకున్న లబ్దిదారులు ఇప్పటికే ఇళ్ల నిర్మాణం ప్రారంభించుకున్నారు.

తాజాగా ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల ప్రోసిడింగ్లు అందించి.. ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించేలా దృష్టిసారించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పలు పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేశారు. కాని వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల ఊసే ఎత్తడం లేదు. తాండూరు మున్సిపల్ పరిధిలో వీలీన కాలనీలు కలిపి సుమారు లక్ష వరకు జనాభా నివసిస్తున్నారు. పట్టణంలో మొత్తం 36 వార్డులు ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు గ్యారెంటీలలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోంది.

తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పాలన ద్వారా పట్టణంలోని లబ్దిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం దాదాపు వేల దరఖాస్తులు అందగా మొదటి విడతలో సుమారు 1400 మందిని గుర్తించారు. ఇందులో నిజమైన పేదలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు పట్టణంలోని దాదాపు 90 మందికి ప్రోసిడింగ్లు అందించాలని నిర్ణయించారు. కాని ప్రోసిడింగ్ల అందజేతకు ముహుర్తం కుదరలేదు. కొంత మందికే ప్రోసిడింగ్లు ఇస్తే మిగతా వారు గగ్గోలు పెడతారని వెనుకడుగు వేసినట్లు తెలిసింది.

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అర్హులందరికి న్యాయం చేసేలా దృష్టిసారిస్తున్నారు. పెద్ద సంఖ్యలో లబ్దిదారులను గుర్తించాలని చూస్తుండడంతో కార్యక్రమం వాయిదా పడినట్లు అధికార వర్గాల సమాచారం. దీంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల గుర్తింపులో గందరగోళం ఏర్పడింది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సైతం పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రోసిడింగ్ పత్రాలు పంపిణీపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. లబ్దిదారులను త్వరగా గుర్తించాలని అధికారులపై ఒత్తిడి తీసుకవస్తున్నారు. అయితే పట్టణంలోని లబ్దిదారులు మాత్రం ఇందిరమ్మ ఇళ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మాకు ఇందిరమ్మ ఇళ్లు ఇంకెప్పుడు ఇస్తారో అని.. తమకు వస్తుందో రాదో అని ఆందోళన చెందుతున్నారు.

ఇదికూడా చదవండి…

