హైవేపై తికమక.. ఉండదిక..!
– సాఫీ ప్రయాణం కోసం క్యూఆర్ కోడ్లు
– స్కాన్ చేస్తే అవసరమైన సేవల వివరాలు
– ఎలాంటి సేవలు అందుబాటులో ఉంటాయో తెలుసా
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : జాతీయ రహదారుల(నేషనల్ హైవే)పై ప్రయాణించే వారు ప్రమాదాలకు గురైనా.. లేదా ఎలాంటి సమాచారం తెలుసుకోవాలన్నా ఇబ్బందులు పడుతుంటారు. మఖ్యంగా అర్దరాత్రి సమయాల్లో అయితే ఆందోళనకు గురయ్యే పరిస్థితులు ఉంటాయి. కొన్ని రోజుల్లోనే ఈ సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలోని జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేయబోతోంది.

ఈ రహదారులపై ప్రయాణం సాఫీగా సాగేందుకు, ప్రయాణికులకు అవసరమైన సేవలు అందించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. దీనిలో భాగంగా క్యూఆర్ (క్విక్ రియాక్షన్) కోడ్లను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఆ కోడ్లతో కూడిన బోర్డులు ఈ నెలలోపు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో రహదారులపై అత్యవసర సేవల సమాచారం తెలిపేందుకు ప్రభుత్వం క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేస్తోంది. వీటిని ప్రతి 10 కిలో మీటర్లకు ఒక చోట అమరుస్తున్నారు. ఎంపిక చేసిన ప్రదేశాల్లో వాహన చోదకులకు సులువుగా అర్థమయ్యేలా మూడు భాషల్లో ఉంటాయి. ఇలా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే పూర్తి సమాచారం ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. మనకు అవసరమైన అంశంపై క్లిక్ చేస్తే సదరు సమాచారం తెలిసిపోతుంది.

తికమక లేకుండా ప్రయాణం
కొన్నిసార్లు పెట్రోల్ అయిపోయినా ఇబ్బంది పడాల్సిందే. ఇలా ప్రయాణంలో మనకు కావాల్సిన సమాచారం తెలుసుకోలేక అవస్థలు పడుతుంటారు. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు రహదారులపై క్యూఆర్ కోడ్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల మీదుగా 6 జాతీయ రహదారులు వెళుతున్నాయి. ఈ జాతీయ రహదారిపై వెళ్లే సమయంలో అత్యవసరమైన సమస్య వస్తే ఎవరిని సంప్రదించాలో తెలియక తికమకపడుతుంటారు. ఈ క్యూఆర్ కోడ్ బోర్డులు టోల్ ప్లాజాలు, ట్రక్ లే బై ప్రాంతాలు, నగరాల ఎంట్రీ రోడ్లు, ప్రధాన పట్టణాలు, హైవే ప్రారంభం, స్లిప్ రోడ్లు, ప్రధాన కూడళ్లు, ముగింపు ప్రాంతాలు, పెట్రోల్ బంక్‌లు, సర్వీస్ కేంద్రాల వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు.

స్కాన్ చేస్తే..
ఎన్‌హెచ్ నిర్మాణం, నిర్వహణ కాలం, అత్యవసర హెల్ప్‌లైన్ నంబరు 1033
రహదారి సంఖ్యతో పాటు ప్రాజెక్టు వైశాల్యం, పోడువు తెలుసుకోవచ్చు.
రహదారిపై పెట్రోలింగ్, టోల్, ప్రాజెక్ట్ మేనేజర్, ఇతర అధికారుల నంబర్లు.
అలాగే సమీపంలోని ఉన్న ఆసుపత్రులు, పెట్రోల్ బంకులు, వాష్‌రూమ్స్, రెస్టారెంట్లు, పోలీస్స్టేషన్లు.
వాహన సర్వీస్ స్టేషన్లు, ఈ-ఛార్జింగ్ స్టేషన్ల వివరాలు, పంక్చర్ షాపులు.
ఇంకా రహదారి పక్కన ఉండే రెస్ట్ ఏరియాలు కూడా తెలుసుకోవచ్చు.

ఇదికూడా చదవండి…

