సీఎం గారు.. మా గోడు వినండి!
– సొంత జిల్లాలో విదేశీ వైద్య విద్యార్థుల నిరసన
– నెలకు రూ.29,792 స్టైపెండ్ చెల్లించాలి
– తాండూరులో 5వ రోజు ఆందోళన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ‘‘ఇతర వైద్య ఇంటర్న్‌లతో సమానంగా విధులు నిర్వహిస్తున్నాం.. కానీ స్టైపెండ్ చెల్లింపుల్లో మాత్రం వివక్ష ఎందుకు? సీఎం గారు మా గోడు వినండి.. మా సమస్యను పరిష్కరించండి’’ అంటూ విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లు (ఎఫ్‌ఎంజీలు) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీఆర్‌ఎంఐ ఇంటర్న్‌షిప్ చేస్తున్న తమకు న్యాయం చేయాలని కోరుతూ నిరసన కొనసాగిస్తున్నారు. సోమవారం 5వ రోజు తాండూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిరసన కొనసాగించారు. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి, ఎఫ్‌ఎంజీఈ పరీక్షలో ఉత్తీర్ణులైన తాము ఓపీ, వార్డులు, అత్యవసర విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నామని విద్యార్థులు తెలిపారు.

అయినప్పటికీ చాలామందికి స్టైపెండ్ అందడం లేదని, మరికొందరికి నెలకు కేవలం రూ.5 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్తించే ఎన్‌ఎంసీ మార్గదర్శకాల ప్రకారం ఇతర ఇంటర్న్‌లతో సమానంగా నెలకు రూ.29,792 స్టైపెండ్ చెల్లించాలని, అర్హత ఉన్న కాలానికి సంబంధించిన బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ డిమాండ్ నెరవేర్చకపోతే ఈ నెల 14 నుంచి డీఎంఈ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన చేపడతామని వెల్లడించారు.


