ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువు..!
– కరువు, విద్యుత్‌ కష్టాలకు ప్రభుత్వమే కారణం
– ఎల్‌నినోపై ముందుజాగ్రత్త లేని సర్కారు
– సింగరేణి ప్రవేటీకరణకు పక్కా కుట్ర
– ప్రభుత్వ వ్యతిరేక చర్యలపై బీఆర్ఎస్ పోరాటం
– కాంగ్రెస్ హయాంలోనే తాండూరుకు తీరని అన్యాయం
– వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచే పోటీ చేస్తా
– తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, విద్యుత్‌ కోతలు, రైతుల పంట నష్టాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యమే కారణమని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి విమర్శించారు. గురువారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అన్ని సమకూర్చి అందిస్తే వడ్డించడం చేతకాని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కోతలు, కరువు పరిస్థితులు రాకుండా ముందు జాగ్రత్తలు చేపడితే.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు అంచనాలు ఉన్నప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. వాతావరణ శాఖ సూచించినా ప్రభుత్వం నిద్రమత్తులో ఉండిపోయిందా అని ప్రశ్నించారు. రైతులను ఆదుకోవడంతో పాటు విద్యుత్‌ సరఫరా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు, లోవోల్టేజీ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రోహిత్‌రెడ్డి అన్నారు. గతంలో వినియోగంలో లేని జనరేటర్లు, ఇన్వర్టర్లను తిరిగి బయటకు తీసే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని తనానికి నిదర్శనమన్నారు.

పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని కోరారు. విద్యుత్‌ సరఫరా, రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి స్పష్టమైన వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని పేర్కొంటూ, దీనిపై సమగ్ర వివరాలు వెల్లడించాలని కోరారు. సింగరేణి ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

తాండూరు అభివృద్ధి విషయంలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం వివక్ష చూపుతోందని రోహిత్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో భూగర్భ జలాల పెంపు కోసం కాగ్నా నదిపై 11 చెక్‌డ్యామ్‌లు నిర్మించామని గుర్తుచేశారు. ప్రస్తుతం కాగ్నా నదిలో ఇసుక దోపిడీ జరుగుతోందని, శివసాగర్‌ ప్రాజెక్టు నుంచి సుమారు 3 వేల టిప్పర్ల ఇసుకను తరలించి రూ.25 కోట్ల విలువైన సంపదకు నష్టం కలిగించారని ఆరోపించారు. తాండూరు నీటి వనరులు, జిల్లా ఆసుపత్రిని కొడంగల్‌కు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆర్టీఓ కార్యాలయాన్ని కూడా తరలించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రి, ఎంసీహెచ్‌లో వైద్య సేవలు దిగజారాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాండూరు అభివృద్ధికి ఎమ్మెల్యే చేసిందేమీ లేదని విమర్శించారు.

తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ప్రచారాలపైనా రోహిత్‌రెడ్డి స్పందించారు. బీఆర్‌ఎస్‌ నుంచి తనను సస్పెండ్‌ చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. వచ్చే ఎన్నికల్లో తాండూరు ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తాండూరు బిడ్డగా ప్రజల మద్దతుతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కొన్ని సర్వేలు తనకు అనుకూలంగా ఉన్నాయని, 70 శాతానికి పైగా ప్రజలు తనను కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ కండువాతోనే ఎన్నికల బరిలో నిలుస్తానని వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్ధ మాజీ చైర్మన్ రాజు గౌడ్, నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, నరుకుల నరేందర్ గౌడ్, సిద్రాల శ్రీనివాస్, నర్సిరెడ్డి తదితరులు ఉన్నారు.

Pvr

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై గురి