మిసైల్‌ మ్యాన్‌కు ఇదేనా గౌరవం..?

తాండూరు రాజకీయం వికారాబాద్

మిసైల్‌ మ్యాన్‌కు ఇదేనా గౌరవం..?
– కలాం జయంతిని విస్మరించడం బాధాకరం
– ప్రభుత్వ తీరుపై 8వ వార్డు కౌన్సిలర్‌ జావేద్‌ ఆవేదన
తాండూరు, దర్శిని ప్రతినిధి: దేశ రక్షణ రంగానికి, శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి విశేష సేవలందించిన మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్‌, దివంగత డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతి వేడుకలను తాండూరులో అధికారికంగా నిర్వహించకపోవడం బాధాకరమని మున్సిపల్‌ 8వ వార్డు కౌన్సిలర్‌ జావేద్‌ తీవ్ర ఆవేధన వ్యక్తం చేశారు.

యువతకు స్ఫూర్తిదాతగా నిలిచిన మహనీయుడి జయంతిని విస్మరించడం శోచనీయమని అన్నారు. గురువారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ దేశ రక్షణ రంగంలో క్షిపణి సాంకేతికత అభివృద్ధికి కలాం చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.

ఆయన జీవితం, వ్యక్తిత్వం నేటి యువతకు ఆదర్శమని, విద్యార్థులు ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని సూచించారు. ఇలాంటి మహనీయుల జీవిత విశేషాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. తాండూరు పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, అధికార యంత్రాంగం కలాం జయంతి వేడుకలను నిర్వహించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

వచ్చే ఏడాది నుంచైనా తెలంగాణ ప్రభుత్వం అబ్దుల్‌ కలాం జయంతిని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపల్‌ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించి, ఆయన సేవలను ప్రజలకు వివరించాలని అభిలాషించారు.

Pvr

టీబీబీఎల్‌లో బీఎస్ఆర్‌ టీం బోణీ..!